మరింత సాయం చేసి ఆదుకోండి- భారత్‌కు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అభ్యర్థన
మందులు, వైద్య పరికరాలు సాయంగా ఇవ్వాలని భారత్‌ను ఉక్రెయిన్ అభ్యర్థిస్తోంది. ఈ మేరుక ఆ దేశాధ్యక్షుడు లేఖ రాశారు.
మానవతా దృక్పథంతో సాయం కోసం ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ లేఖ రాశారు. భారత పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా మంగళవారం (ఏప్రిల్ 11) విదేశాంగ మంత్రి మీనాక్షి లేఖికి ఈ లేఖ అందజేశారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు తన లేఖలో అదనపు మందులు, వైద్య పరికరాలను పంపడానికి సహాయం చేయాలని భారతదేశాన్ని అభ్యర్థించారు. తమ దేశంలో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తున్నట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి చెప్పారు, ఇది వేల మంది భారతీయ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.
భారత్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా మాట్లాడుతూ రష్యాకు అండగా నిలవడమంటే చరిత్రకు రాంగ్ సైడ్‌లో ఉండటమేనని, తమ దేశం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. పాకిస్థాన్‌తో తమ దేశ సైనిక సంబంధాలు మూడు దశాబ్దాల క్రితమే ప్రారంభమయ్యాయని, అయితే పాకిస్తాన్‌తో తమ స్నేహం భారత్‌కు మాత్రం వ్యతిరేకం కాదన్నారు.
జి-20 ప్రస్తుత అధ్యక్షుడిగా ప్రపంచ నేతగా శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ భారత్‌కు విజ్ఞప్తి చేశారు. దీని కోసం భారత అధికారులు ఉక్రెయిన్‌లో పర్యటించాలని సూచించారు. దీని వల్ల ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిలో మార్పు వస్తుందన్నారు. ఉక్రెయిన్‌తో భారత్ కొత్త, మెరుగైన సంబంధాలను పెంపొందించుకోవడానికి కొంత సమయం పట్టవచ్చునని, కానీ ఏదో ఒక రోజు అది సాధ్యపడుతుందని ఆయన అన్నారు.