Udhayanidhi Stalin: I.N.D.I.Aలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు కలకలం- ఖండించిన మమత, కేజ్రీవాల్
Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత తనయుడు ఉదయనిధి స్టాలిన్ మరోసారి రెచ్చిపోయారు. హిందూమతం, హిందూ మత పెద్దల గురించి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత తనయుడు ఉదయనిధి స్టాలిన్ I.N.D.I.Aలో ఉదయనిధి వ్యాఖ్యలు కలకలం రేపాయి. కూటమిలోని పార్టీలు సనాతన ధర్మానికి అనుకూల, వ్యతిరేక పార్టీలుగా విడిపోయాయి. దీంతో వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో I.N.D.I.Aను డైలమాలోకి పడేశాయి. ఉదయనిధి మాటలు కూటమిలో అలజడి రేపుతున్నాయి. దీంతో కూటమిలోని పార్టీలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. వచ్చే ఎన్నికల్లో ఉదయనిధి మాటలు కూటమికి నష్టాన్ని కలిగిస్తాయని భావించిన పార్టీలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి.
కూటమిని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీలు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భారత్ సెక్యులర్ దేశమని, ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం కూటమికి మంచిది కాదని, అన్ని మతాలను గౌరవించడమే తమ పార్టీల విధానమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాత్రం ఏ విధంగాను స్పందించలేదు. కీలక పార్టీలకు చెందిన మరికొందరు సీనియర్ నేతలు మౌనం పాటిస్తున్నారు. బీజేపీ మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. ‘మారణహోమానికి పిలుపు’తో సమానమని వ్యాఖ్యానించింది.
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన (ధర్మం) గురించి మాట్లాడినందుకు తన తలకు గుండు చేస్తే ఉత్తరప్రదేశ్‌లోని పరమహంస ఆచార్య రూ.10 కోట్లు ఇస్తానని ప్రకటించారని, తన తల దువ్వుకోవడానికి 10 రూపాయల దువ్వెన సరిపోతుందన్నారు. తమిళంలో చాప్ లేదా స్లైస్ అనే పదానికి జుట్టు దువ్వడం అని కూడా అర్థం వస్తుంది. తనకు బెదిరింపులు కొత్త కాదని, ఈ బెదిరింపులన్నింటికీ భయపడే వాళ్లం కాదన్నారు. తమిళం కోసం రైలు పట్టాలపై తల పెట్టిన కళాకారుడికి మనవడిని అని ఉదయనిధి అన్నారు.
ఆయన తన దూకుడు పెంచుతూ.. బీజేపీ ఆరోపణను ఫేక్ న్యూస్‌గా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ గురించి మాట్లాడుతున్నారు. దీని అర్థం కాంగ్రెస్ సభ్యుల హత్య కాదా? అంటూ నిలదీశారు. సనాతన ధర్మం అంటే ఏంటని ప్రశ్నించారు. కొన్ని వందల ఏళ్ల క్రితం, మహిళలు చదువుకోకూడదని చెప్పారని, మహిళలు తమ శరీరాన్ని కప్పి ఉంచుకోకూడదని, దేవాలయాల్లోకి ప్రవేశించకూడదని నియమాలు ఉన్నాయని, తాము అన్నింటిని మార్చామన్నారు. ఇది ద్రవిడ నమూనా అన్నారు. హిందూ సంఘాల నుంచి విమర్శలు వచ్చినా తాను మాత్రం తగ్గేది లేదన్నారు. సనాతన ధర్మంలోని లోపాలపై పదే పదే విమర్శలు చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
స్టాలిన్‌పై హిందూ మత పెద్దల విమర్శలు
రామనగరి అయోధ్యలో ఉదయనిధి స్టాలిన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సనాతన హిందూ ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ అయోధ్యలోని సన్యాసి కంటోన్మెంట్‌కు చెందిన సంత్ జగత్ గురు పరమహంస ఆచార్య ఉదయనిధి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదే సమయంలో ఉదయనిధి ఫోటోలో తలను కత్తితో పొడిచారు.
డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి తలను తీసుకువచ్చే వారికి రూ. 10 కోట్లు రివార్డ్ ఇస్తానని పరమహంస ప్రకటించారు. అయితే, ఎవరూ ఆ పని చేయకపోతే.. తానే స్వయంగా ఉదయనిధి తలను తీసేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం కత్తిని కూడా సిద్ధం చేశానని అన్నారు. ఉదయనిధికి ఇతర మతాల గురించి ఇలాగే మాట్లాడే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు.
ఇతర మతాలపై ఉదయనిధి వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికి ముక్కలు ముక్కలై ఉండేవాడని పరమహంస ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం మానవతావాదం, అహింసకు మద్ధతుగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని నమ్ముకున్న తాము మానవతావాదులమన్నారు. చెడును కూడా అంతమొందించే ధైర్యం ఉందన్నారు. రాక్షసులను కూడా మట్టుబెట్టే తత్వాన్ని సనాతన ధర్మం నేర్పుతుందని, ఉదయనిధి ఇప్పుడు రాక్షసుడేనని వ్యాఖ్యానించారు.