Indian Railway: డ్యూటీలో నిద్ర పోయిన స్టేషన్ మాస్టర్, అక్కడే నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు
Indian Railway : ఓ స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం ఫలితంగా అర్ధగంట పాటు ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. నిద్రలోకి జారుకున్న స్టేషన్ మాస్టర్ లైన్ క్లియర్ చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.
Indian Railway News : రైల్వేశాఖలో పని చేసే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పెను ప్రమాదాలకు కారణం కావచ్చు. ఉత్తరప్రదేశ్‌లో ఒక స్టేషన్ మాస్టార్ చేసిన నిర్వాకం వల్ల అర్ధ గంటపాటు స్టేషన్‌లోనే రైలు నిలిచిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు రైలు నిలిచిపోయింది. పొరపాటున సిగ్నల్ ఉండి వెళ్లిపోతే ప్రమాదానికి కారణమయ్యేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిద్రలోకి జారుకున్న స్టేషన్ మాస్టార్
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా సమీపంలోని ఉడిమోర్ జంక్షన్ సమీపంలోని రైల్వే స్టేషన్‌లో పని చేసే స్టేషన్ మాస్టార్ విధుల్లో ఉండగా నిద్రలోకి జారుకున్నారు. అదే సమయంలో అటుగా పట్నా - కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు ఆ జంక్షన్‌కు చేరుకుంది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్ల వివరాలను చూసుకుని ఆ ఎక్స్‌ప్రెస్ రైలుకు లైన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత స్టేషన్ మాస్టార్‌ది. కానీ, ఈ రైలు వచ్చే సమయంలో స్టేషన్ మాస్టార్ నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఆ జంక్షన్ నుంచి ముందుకెళ్లేందుకు అనుగుణంగా ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టేషన్ మాస్టార్ లైన్ క్లియర్ చేసే సిగ్నల్‌ను ఇవ్వలేదు. దీంతో ఈ రైలు అర్ధగంటపాటు ఆ జంక్షన్‌లోనే నిలిచిపోయింది. స్టేషన్ మాస్టార్‌ను మేల్కొలిపేందుకు అనేకమార్లు ట్రైన్‌లోని లోకో పైలెట్ హారన్ కొట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. అర గంటపాటు రైలు జంక్షన్‌లో నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
రైల్వే అధికారులు ఆగ్రహం
స్టేషన్ మాస్టార్ నిర్లక్ష్య వైఖరి పట్ల రైల్వే అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు.. స్టేషన్ మాస్టార్‌ను పిలిపించి వివరణ కోరారు. ఈ నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలిపై చర్యలు తీసుకుంటామని రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ఇకపోతే, ఈ ఘటనలో తన తప్పును స్టేషన్ మాస్టార్ అంగీకరించారు. తప్పిదానికి క్షమాపణ కోరారు. తనతోపాటు విధుల్లో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీకి వెళ్లడంతో తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు.