Ayodhya Ram Mandir: అయోధ్య వేడుకలపై తమిళనాడులో నిషేధం ఉందా! లేదా? కేంద్ర మంత్రి వర్సెస్ తమిళనాడు మంత్రి
TN minster Sekar Babu reacted to Nirmal Sitaramans Tweet: అయోధ్యలో జరగనున్న ఈవెంట్ కు సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల్ని తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తీవ్రంగా ఖండించారు.
Ramlala Pran Pratishtha: శతాబ్ధాల నుంచి ఎదురుచూసిన అపురూప ఘట్టం అయోధ్యలో రామాలయం. మరికొన్ని గంటల్లో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం (Ayodhya Ram Mandir Opening) కానుండగా.. లైవ్ వీక్షించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే తమిళనాడులో అందుకు పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయని, ఆ రాష్ట్ర ప్రభుత్వం రామ మందిరం ప్రారంభోత్సవాన్ని నిషేధించడం సరికాదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్వీట్లు చేశారు. హిందూ వ్యతిరేక నిర్ణయాలు, ఏదైనా మతానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని ఆమె ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయోధ్యలో జరగనున్న ఈవెంట్ కు సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల్ని తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తీవ్రంగా ఖండించారు. సేలంలో నిర్వహించిన డీఎంకే యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ.. అయోధ్యలో వేడుక సమయంలో దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధంచలేదని స్పష్టం చేశారు.
Tamil Nadu Hindu Religious and Charitable Endowments Minister PK Sekar Babu tweets, "A planned rumour is being spread to divert the DMK Youth wing Conference, which is going on in full swing in Salem. The charity department has not imposed any restrictions on the devotees to… https://t.co/SuU2DnvIO7 pic.twitter.com/mGfFh2TVei
— ANI (@ANI) January 21, 2024
తమిళనాడులో ఎలాంటి ఆంక్షలు విధంచలేదు..
ఆ సమయంలో ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడంపై తమిళనాడులో ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. శ్రీరాముడి పేరిట భజన చేయడం, అన్న ప్రసాదాలు పంచడం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ఆంక్షలు కూడా విధించలేదని మంత్రి శేఖర్ బాబు పునరుద్ఘాటించారు. అయితే కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా నిర్మలా సీతారామన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అన్నారు. ఉద్దేశపూర్వకంగా తమిళనాడు ప్రభుత్వంపై, డీఎంకే నేతలపై కేంద్రం బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు.
మొదటగా నిర్మలా సీతారామన్ ఆరోపణలు ఇవీ..
రాముడిపై ఉన్న భక్తితో రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావించగా, పేదలకు మిఠాయిలు పంచి పెట్టాలన్నా సైతం తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. అయోధ్య వేడుకను లైవ్ టెలికాస్ట్ సమయంలో పవర్ కట్ చేసే అవకాశం ఉందని సంచలన విషయాలను పోస్ట్ చేశారు. హిందూ వ్యతిరేక చర్యలు చేపట్టడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటేనంటూ నిర్మలా సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడులో దాదాపు 200 రామాలయాలున్నాయి. కానీ రాముడి పేరిట ఎక్కడా పూజలు, వేడుకలు, భజన కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు సరికాదన్నారు. ఇక ప్రైవేట్ ఆలయాల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు.
మంత్రి శేఖర్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన సీతారామన్
ఆలయాల్లో రామభజనలు ఆపివేయాలని పోలీసులు తమను బెదిరిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.. అదే విషయం తాను వెల్లడించానన్నారు నిర్మలా సీతారామన్. మంత్రి శేఖర్‌బాబు తన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంపై కేంద్ర మంత్రి స్పందించారు. చెంగల్‌పేట జిల్లా మదురాంతగం రామాలయంలో పూజలు చేయడానికి తమకు అనుమతి లేదు అని గత రాత్రి నుంచి నిరంతరం కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తాను అబద్ధం చెప్పలేదని, వదంతులు వ్యాప్తి చేయడం లేదు అని.. కేవలం ప్రజలు చేసిన ఫిర్యాదులను మాత్రమే తాను ట్వీట్‌లో పోస్ట్ చేసినట్లు వెల్లడించారు. మంత్రి శేఖర్ బాబు చేసిన ట్వీట్ లపై ప్రజలు స్పందించి క్లారిటీ అడుగుతున్నారని చెప్పారు. పూజ, భజనలు చేసేందుకు తమకు అనుమతి లేదని, అయోధ్య ఈవెంట్ లైవ్ టెలికాస్ట్‌లను ఎవరూ అడ్డుకోరని మంత్రి శేఖర్ బాబు చెప్పగలరా అని ప్రశ్నించారు.