Who Do Not Speak Hindi Should Leave India : దేశంలో ఉండాలంటే హిందీ మాట్లాడాల్సిందే ! ఈ బీజేపీ మంత్రి అదే చెబుతున్నారు !
దేశంలో ఉండాలంటే హిందీ మాట్లాడాల్సిందేనని యూపీ బీజేపీ మంత్రి సంజయ్ నిషాద్ తేల్చి చెప్పారు. ఇటీవల దక్షిణాదిలో హిందీపై జరుగుతున్న చర్చ రచ్చ అవుతున్న సమయంలో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
హిందీ భాషపై దక్షిణాదిలో ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. హిందీ జాతీయ భాష కాదని దక్షిణాది తారలు అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదన కూడా అదే. కానీ కేంద్రం మాత్రం.. హిందీని రాష్ట్రాల్లో నేర్చుకోవాలని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ప్రభంజనంలో దక్షిణాది సినిమాలు డబ్బింగ్ అయి రికార్డు వసూళ్లు సాధిస్తు్న్నాయి. ఈ క్రమంలో యూపీ బీజేపీ మంత్రి సంజయ్ నిషాద్.. హిందీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ మాట్లాడటం రాని వాళ్లు దేశ విడిచి వెళ్లిపోవాలన్నారు.
“భారతదేశంలో నివసించాలనుకునే వారు హిందీని ప్రేమించాలి. మీరు హిందీని ఇష్టపడకపోతే, మీరు విదేశీయుడిగా లేదా విదేశీ శక్తులతో ముడిపడి ఉన్నారని అనుకుంటాం. మేము ప్రాంతీయ భాషలను గౌరవిస్తాము, కానీ ఈ దేశం ఒకటి, మరియు భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం, భారతదేశం 'హిందూస్థాన్' అంటే హిందీ మాట్లాడే వారి ప్రదేశం. హిందుస్థాన్ హిందీ మాట్లాడని వారికి చోటు కాదు. వాళ్ళు ఈ దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళాలి” అని సంజయ్ నిషాద్ స్పష్టం చేశారు.
బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఒకే దేశం - ఒకే భాష అంటూ.. గతంలో అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరూ విధిగా హిందీ నేర్చుకోవాలన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు విాదాస్పదం అయ్యాయి. రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అవసరమని.. హిందీ దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా తేల్చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచగల భాష ఏదైనా ఉందంటే అది అత్యధికంగా మాట్లాడే హిందీ మాత్రమేనని తన చాయిస్ కూడా చెప్పేశారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలు గన్న ‘‘ఒకే దేశం, ఒకే భాష’’ నినాదాన్ని నిజం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల కూడా ఆయన అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. దక్షిణాది నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా హిందీని తమపై రుద్దుతున్నారని.. తమ మాతృభాషలు ప్రమాదంలో పడతాయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మరింత రెచ్చగొట్టేలా హిందీ మాట్లాడలేని వాళ్లు విదేశీ శక్తులని.. దేశం విడిచి వెళ్లాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. యూపీ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై సహజంగానే దక్షిణాదిలో విమర్శలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని బీజేపీ నేతలు ఎలా సమర్తించుకుంటారో చూడాలి.