Civila Aspirants Death: 'మా బిడ్డ మృతిని టీవీల్లో చూసి తెలుసుకున్నాం' - బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన వరద
Delhi Floods: ఢిల్లీలో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందిన ఘటన బాధిత కుటుంబాలు, విద్యార్థుల్లో తీవ్ర విషాదం నింపింది. శిక్షణ కోసం వచ్చిన వారు విగతజీవులుగా మారడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
Civil Aspirants Death In Delhi Coaching Center: దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) రావూస్ ఐఏఎస్ అకాడమీలో వరదల్లో చిక్కుకుని ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలన్న కలతో శిక్షణ కోసం వెళ్లిన వారు ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. బాధిత కుటుంబీకులు తమ వారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. దేశ అత్యున్నత సర్వీసు పరీక్షలో రాణిస్తారని భావించామని.. కానీ ఇలా విగతజీవులుగా మారారని కన్నీళ్లు పెట్టుకున్నారు. శనివారం సాయంత్రం భారీ వర్షంతో కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి భారీగా వరద చేసి అక్కడ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీట మునిగారు. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన తానియా సోని, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయా యాదవ్, కేరళకు చెందిన నవీన్ సెల్వి ప్రాణాలు కోల్పోయారు.
'టీవీలో చూసి తెలుసుకున్నాం'
సివిల్ సర్వీసెస్‌పై మక్కువతో ఏప్రిల్‌లోనే యూపీ ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు శ్రేయాయాదవ్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. శ్రేయ అంకుల్ శుభాంగ్ యాదవ్.. కోచింగ్ సెంటర్, అధికార యంత్రాంగం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. శనివారం సాయంత్రం టీవీలో ఈ ఘటన గురించి తెలిసిందని.. వెంటనే శ్రేయకు కాల్ చేశామని కానీ మాట్లాడలేక పోయామని ఆవేదన చెందారు. 'ఈ ఘటనపై అటు కోచింగ్ సెంటర్ నుంచి కానీ.. ఇటు అధికారుల నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. టీవీ వార్తల్లో చూసి మార్చురీ దగ్గరకు వెళ్లి మృతదేహాలను చూడాలని అడిగినా నిరాకరించారు. చివరకు మృతుల్లో శ్రేయాయాదవ్ పేరు ఉన్న పేపర్‌ను చూపించారు.' అంటూ వాపోయారు.
తెలంగాణ విద్యార్థిని మృతి
కాగా, ఈ ఘటనలో తెలంగాణకు చెందిన విద్యార్థిని తానియా సోని (25) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే సోని తండ్రి విజయ్ కుమార్‌కు ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విద్యార్థిని భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని తన కార్యాలయ అధికారులు.. అక్కడి పోలీసులు, ఇతర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
Saddened by the tragic demise of Ms. Tania Soni, a resident of Secunderabad who lost her life in the flooding at an IAS coaching center in Rajender Nagar, New Delhi.
— G Kishan Reddy (@kishanreddybjp) July 28, 2024
Personally spoke to her father, Shri Vijay Kumar, and expressed my deepest condolences. My office in Delhi is in…
ఎఫ్ఐఆర్ నమోదు.. ఇద్దరి అరెస్ట్
మరోవైపు, సివిల్స్ అభ్యర్థుల మృతి ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై వేర్వేరు దర్యాప్తు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్‌ను దేశ్ పాల్ సింగ్‌లను అరెస్ట్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు డీసీపీ హర్షవర్థన్ తెలిపారు. కోచింగ్ సెంటర్‌లో స్టోర్ రూంను లైబ్రరీగా ఉపయోగిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ నివేదిక ఆధారంగా గుర్తించామన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని వెల్లడించారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కరోల్‌బాగ్‌లో విద్యార్థుల నిరసన
Saddened by the tragic demise of Ms. Tania Soni, a resident of Secunderabad who lost her life in the flooding at an IAS coaching center in Rajender Nagar, New Delhi.
— G Kishan Reddy (@kishanreddybjp) July 28, 2024
Personally spoke to her father, Shri Vijay Kumar, and expressed my deepest condolences. My office in Delhi is in…
ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థుల మృతి పట్ల విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం వహించిన కోచింగ్ సెంటర్ యాజమాన్యం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేశారు. నిరసనలు ఉద్ధృతం కాగా రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.