బెంగళూరులో 42 కోట్లు సీజ్- తెలంగాణ ఎన్నికల కోసమే తరలిస్తున్నట్టు అనుమానం
42 కోట్లు కూడా తెలంగాణలో ఎన్నికల కోసం తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ఈ డబ్బు మొత్తం కర్ణాటకలోని ఓ మంత్రికి చెందినదిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా నగదు చిక్కుతోంది. ఇది తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రాల్లోకూడా నగదును పట్టుకుంటోంది ఐటీ శాఖ. తాజాగా బెంగళూరులో భారీగా నగదును ఐటీ శాఖాధికారులు గుర్తించారు. 42 కోట్ల రూపాయలను రైడ్ చేసి పట్టుకున్నారు.
42 కోట్లు కూడా తెలంగాణలో ఎన్నికల కోసం తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ఈ డబ్బు మొత్తం కర్ణాటకలోని ఓ మంత్రికి చెందినదిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా 50 కోట్ల రూపాయలు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే 8 కోట్ల రూపాయలు తెలంగాణ తరిలించినట్టు గుర్తించారు అధికారులు. మిగతా డబ్బు లారీల్లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఈ ఉదయం కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ అశ్వద్థామ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆర్టీ నగర్‌లో ఉన్న ఆయన రెండు నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లోనే భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పెట్టెల్లో పద్దతిగా పేర్చి తరలించడానికి సిద్ధంగా ఉంచిన 42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అశ్వద్థామ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తికి బంధువు.