ధైర్యం ఉంటే మా క్యాడర్‌ని టచ్ చేయండి, బెదిరింపులకు భయపడం - స్టాలిన్‌కి అన్నమలై వార్నింగ్
BJP Chief Annamalai: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కి బీజేపీ చీఫ్ అన్నమలై వార్నింగ్ ఇచ్చారు.
Stalin Vs Annamalai:
హీటెక్కిన రాజకీయాలు..
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్‌తో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే బీజేపీపై డైరెక్ట్ వార్ ప్రకటించారు. "అనవసరంగా రెచ్చగొట్టద్దు" అంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీకి హెచ్చరికలు చేస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. "మా క్యాడర్ జోలికి రావద్దు" అని తేల్చి చెప్పారు. దీనిపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై తీవ్రంగా స్పందించారు. శివగంగలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ క్యాడర్‌కి వార్నింగ్ ఇచ్చి స్టాలిన్ హద్దులు దాటారని మండి పడ్డారు. కనిమొళిని అరెస్ట్ చేసినప్పుడు కూడా స్టాలిన్ ఇంతగా అసహనానికి లోనుకాలేదని సెటైర్లు వేశారు.
"కనిమొళిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలా అసహనానికి గురి కాలేదు. అంటే...తమిళనాడు ప్రజలు అనుకుంటున్నట్టుగానే...సెంథిల్ బాలాజీ డీఎమ్‌కే పార్టీకి ట్రెజరర్‌గా పని చేస్తున్నాడు. బీజేపీకి వార్నింగ్ ఇచ్చి ఆయన హద్దులు దాటి మాట్లాడారు. మా క్యాడర్‌ని ముట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తారా. నేనూ అదే అంటున్నా. బీజేపీ క్యాడర్‌ని టచ్ చేసి చూడండి. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. కచ్చితంగా దీటైన బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండేళ్లుగా తమిళనాడు ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయింది ఈ ప్రభుత్వం"
- అన్నమలై, తమిళనాడు బీజేపీ చీఫ్
స్టాలిన్ తీవ్ర ఆగ్రహం..
సెంథిల్ బాలాజీ అరెస్ట్ తరవాత తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రదర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇస్తేనే సీబీఐ రాష్ట్రంలోకి రావాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దాంతో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల బాటలో తమిళనాడు నడుస్తున్నట్లు అయింది. తమిళనాడు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఏదైనా దర్యాప్తు చేయడానికి ముందు సీబీఐ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకున్న పదో రాష్ట్రంగా నిలిచింది తమిళనాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షపార్టీల నేతల్ని ఇబ్బందులకు గురిచేసేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. అందువల్లే తాము రాష్ట్రంలో సీబీఐ విచారణకు రావాలంటే సాధారణ అనుమతిని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులపై తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేయడానికి ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను ఉసిగోల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సెంథిల్ బాలాజీ అరెస్ట్..!
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ నివాసాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. దాదాపు 17 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. తరవాత చెన్నై నుంగంబాక్కంలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. సెంథిల్ బాలాజీని విచారణ కోసం తీసుకెళ్లారా లేక అరెస్టు చేశారా అనే దానిపై సందిగ్ధత నెలకొనగా, ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సెంథిల్ బాలాజీని అధికారులు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను ఒమందురార్ ప్రభుత్వాసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్పించారు. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఏడుస్తూ కనిపించారు.