Home Delivery Of Alcohol: స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ హోం డెలవరీ- ఆలోచన చేస్తున్న ఫుడ్‌డెలవరీ యాప్స్
Swiggy Zomato And BigBasket:మద్యం ప్రియులకు మంచి ఊపు తీసుకొచ్చే వార్త ఇది. స్వీగ్గీ, జొమాటాలో స్టఫ్‌తోపాటు లిక్కర్ కూడా తెప్పించుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు.
Alcohol Home Delivery : తినే ఫుడ్ నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకు చాలా మంది హోం డెలవరీ యాప్స్‌పైనే ఆధార పడుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండానే అన్నీ గుమ్మం ముందుకు వచ్చేస్తున్నాయి. దీన్నే క్యాష్ చేసుకుంటున్న వివిధ సంస్థలు సకలం ఆర్డర్ పెట్టుకోండి గుమ్మం వద్దకే తీసుకొచ్చి ఇస్తామంటున్నాయి.
ఇప్పుడు ఫుడ్‌తోపాటు మద్యం కూడా హోం డెలవరీ చేసేస్తామంటూ కొత్త శుభవార్త చెప్పేస్తున్నాయి హోం డెలివరీ యాప్స్. మద్యం తాగాలని ఉన్నా.. బయటకు వెళ్లి తీసుకొనే ఓపిక లేని వాళ్లు, మొహమాటపడి షాపులకు వెళ్లలేని వారందరికీ ఇది నిజంగానే ఎగిరి గంతేసే వార్త. అయితే ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసిన తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తారు.
ఇంటి వద్దకే మద్యం డెలవరీ కాన్సెప్టును బీర్, వైన్, లిక్కర్ తక్కువ ఆల్కాహాల్ ఉన్న డ్రింక్స్‌కు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అందులోనూ కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేస్తారు. తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే మొదట ఈ హోం డెలవరీ లిక్కర్ పాలసీ తీసుకురానున్నారు. అక్కడ జనాల ఆదరణ చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరణ నిర్ణయం తీసుకుంటారు.
లిక్కర్ హోం డెలవరీ అంశంపై ఆయా రాష్ట్రాల అనుమతులపై కూడా ఆధారపడి ఉంటుంది. దీనికి కచ్చితంగా రాష్ట్రాల అనుమతి అవసరం ఉంది. కరోనా టైంలో అప్పటి పరిస్థితులను బట్టి కొన్ని రాష్ట్రాలు మద్యం హోం డెలవరీని ఎంకరేజ్ చేశాయి. పరిస్థితులు చక్కబడితే ఆ ఫెసిలిటీని బంద్ చేశాయి.
ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఈ మద్యం హోం డెలవరీ కాన్సెప్టును రన్ చేస్తున్నాయి. దీని వల్ల మద్యం అమ్మకాలు 20 నుంచి 30 శాతం పెరిగాయని చెబుతున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ లిక్కర్ హోం డెలవరీ స్కీం నడుస్తోంది.