Stray Dogs Ban Case: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వీధి కుక్కల నిషేధంపై వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు-జాతీయ విధానం కోసం రాష్ట్రాలకు నోటీసులు
Stray Dogs Ban Case: వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కుక్కలకు టీకాలు వేసి తీసుకెళ్లిన ప్రాంతంలో విడిచిపెట్టాలని కోర్టు పేర్కొంది.

Stray Dogs Ban Case: ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుంచి వీధి కుక్కలను తరిమేయాలని, వాటిని షెల్టర్ హోమ్‌లలో శాశ్వతంగా ఉంచే కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఇతర పరిణామాలను గమనించిన సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పును సవరించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకుంది. ధర్మాసనం మాట్లాడుతూ మేము గత ఉత్తర్వులలో కొన్ని సవరణలు చేస్తున్నాము అన్నారు. జస్టిస్ విక్రమ్ నాథ్ ఉత్తర్వులను చదువుతూ, జాతీయ విధానంపై చర్చించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ కేసులో చేర్చామని అన్నారు. వారందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు గత ఉత్తర్వులను సవరిస్తూ, కుక్కలను తిరిగి వదిలివేయడంపై విధించిన నిషేధాన్ని తొలగించింది. రేబిస్, ప్రమాదకరమైన కుక్కలను వదలకూడదని కోర్టు పేర్కొంది. పట్టుబడిన కుక్కలకు టీకాలు వేసి తిరిగి వదలాలని కోర్టు తెలిపింది. అదనంగా, అనారోగ్యంతో ఉన్న, దూకుడుగా ఉన్న కుక్కలను షెల్టర్ హోమ్‌లలోనే ఉంచాలంది. కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టొద్దని, ప్రతి ప్రాంతంలో ఒక నిర్దిష్ట స్థలం ఉండాలని కోర్టు పేర్కొంది.
Stray dogs in Delhi NCR matter | Supreme Court modifies August 11 order saying stray dogs will released back to the same area after sterilisation and immunisation, except those infected with rabies or exhibiting aggressive behaviour. pic.twitter.com/3s3o6ccQR1
— ANI (@ANI) August 22, 2025
ప్రజా స్థలాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడితే చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్కలను పట్టుకునే బృందం పనికి ఆటంకం కలిగించే వ్యక్తికి 25 వేలు, ఎన్జీవోలకు 2 లక్షల జరిమానా విధిస్తారు.
వీధి కుక్కలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలని, షెల్టర్లు లేదా డాగ్ పౌండ్లు ఏర్పాటు చేయాలని, ఎనిమిది వారాలలోపు నివేదికను సమర్పించాలని నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రక్రియను అడ్డుకునే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
ఆ ఆదేశాలను సవరిస్తూ "దూకుడుగా ఉండే లేదా రాబిస్ ఉన్న కుక్కలకు టీకాలు వేయాలి" అని శుక్రవారం కేసును విచారించిన న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడిన త్రి సభ్య ధర్మాసనం తెలిపింది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఇంకా ఇలా అన్నారు "ఇలాంటి అన్ని కేసులను ఈ కోర్టుకు బదిలీ చేయాలి. అప్పుడు ఓ కీలకమైన నిర్ణయం తీసుకోగలం. గత విచారణ తర్వాత మేము కొన్ని మార్పులను సూచించాము. అందుకే అన్ని కేంద్ర, రాష్ట్రాలను కూడా ఇందులో భాగం చేశాం."
గతంలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది, జంతు సంరక్షణ సంఘాలు, డాగ్ లవర్స్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆగస్టు 14న, ఈ విషయాన్ని ప్రత్యేక ధర్మాసనం విచారించింది. బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసింది, ఇప్పుడు అది వెలువడింది. గత విచారణ సందర్భంగా, ఢిల్లీలో వీధి కుక్కల బెడద స్థానిక అధికారులు వైఫల్యం వల్లే పెరిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.





















