Special Parliament Session: ప్రత్యేక అజెండాతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు- ఏ క్షణం ఏదైనా జరగొచ్చని అంచనాలు
Special Parliament Session: తొలిరోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయి. ఆ తరవాత రేపటి నుంచి(సెప్టెంబర్ 19న) కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.
Special Parliament Session: నేటి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ సమావేశాల కోసం ప్రత్యేక అజెండా ఖరారు చేసిన ఏ క్షణం ఏ బిల్లు టేబుల్ చేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఒకటి రెండు కీలకమైన బిల్లు సభలో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తొలిరోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయి. ఆ తరవాత రేపటి నుంచి(సెప్టెంబర్ 19న) కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. జూన్1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ని ప్రారంభించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులోనే Sengolని ఏర్పాటు చేశారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
కేంద్రం విడుదల చేసిన ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణంపై చర్చించనున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేర్వేరుగా బులెటిన్లు విడుదల చేశాయి. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనుంది.
ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ జరగనుంది. రాజ్యసభలో కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. గత నెల 10న రాజ్యసభలో ప్రవేశపెట్టింది. నియామక ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు... ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ నుంచి సీజేఐను తొలగించింది. దీంతో ఈ నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుతో పాటు నాలుగు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి... ఆమోదించనుంది. ద అడ్వొకేట్స్ బిల్లు, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుల గురించి చర్చిస్తారని సమాచారం. ఉమ్మడి పౌరస్మృతిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ల నుంచి ఇటీవలే అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెషన్‌లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. సభ్యులు విడిగా తాత్కాలిక క్యాలెండర్‌ని అందుకుంటారు.