Vice President Elections: ఉపరాష్ట్రపతి ఎన్నికల విధానం తీరే వేరు, ప్రత్యేక మెజారిటీతో గెలుపు ఎలా? పూర్తి ప్రక్రియ ఇదే
ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తే ఉపరాష్ట్రపతిగా ప్రకటించరు.

భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదవి రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థి ఎన్నికలాంటిది కాదు. ఈ ఎన్నికలలో ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని విజేతగా ప్రకటించడానికి రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ప్రత్యేక మెజారిటీ (Special Majority) అంటారు.అసలు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? ఎవరు ఎన్నుకుంటారు? విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఈ ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి? వంటి పూర్తి వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందంటే ?
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరగాలనే విషయాన్ని రాజ్యాంగంలోని 66వ అధికరణ స్పష్టం చేస్తుంది. సాధారణంగా ఎన్నికలు జరిగితే అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిని, అంటే ప్రత్యర్థిపై ఒక్క ఓటు ఆధిక్యత సాధించినా, ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక అలా జరగదు. ఈ ఎన్నికలో విజేతను నిర్ణయించడానికి సాధారణ మెజారిటీ కాకుండా, ప్రత్యేక మెజారిటీ అనే పద్ధతి ద్వారా నిర్ణయిస్తారు. దీనినే ఉపరాష్ట్రపతి ఎన్నికల మెజారిటీ అని కూడా అంటారు.
ప్రత్యేక మెజారిటీ అంటే ఏమిటి?
ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తే ఉపరాష్ట్రపతిగా ప్రకటించరు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు (50% + 1) రావాలి. దీనినే ‘ప్రభావవంతమైన మెజారిటీ’ (Effective Majority) అని కూడా అంటారు. ఉదాహరణకు, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో 788 మంది ఎంపీలు ఓటు హక్కు కలిగిన వారు ఉన్నారనుకుందాం. అందులో ఎన్నికల రోజు 780 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారనుకుందాం. అప్పుడు ఉపరాష్ట్రపతి గెలుపుకు మొత్తం పోలైన ఓట్లలో సగం అంటే 780 / 2 = 390. కాబట్టి, గెలుపొందాలంటే అభ్యర్థికి కనీసం 391 ఓట్లు రావాలి. సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువ మెజారిటీ ఉన్నా ఆ అభ్యర్థిని ప్రత్యేక మెజారిటీ అనే పద్ధతిలో ఉపరాష్ట్రపతిగా గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ సరిగ్గా సగం వచ్చినా గెలుపొందినట్లు కాదు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల విధానంగా ‘సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్’
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రత్యేక మెజారిటీతో పాటు అనుపాత ప్రాతినిధ్య ఓటింగ్ పద్ధతి (Proportional Representation)లోని ‘సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్’ (Single Transferable Vote - STV) అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో ప్రాధాన్యతా ఓట్ల క్రమం ఉంటుంది. అంటే ఓటరు ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులను తన ప్రాధాన్యత ప్రకారం వరుసగా 1, 2, 3 అని ఓటు వేయడం జరుగుతుంది. ఇలా వేసిన ఓట్లలో ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఏ అభ్యర్థి అయినా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పైన చెప్పినట్లు సగం కన్నా ఎక్కువ ప్రత్యేక మెజారిటీ సాధిస్తే, ఆ అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచినట్లు ప్రకటిస్తారు. అలా రాకపోతే, బరిలో ఉన్న అభ్యర్థులలో అత్యల్ప ఓట్లు సాధించిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుండి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఇలా అవసరమైన మెజారిటీ సాధించే వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ప్రత్యేక మెజారిటీ, సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటింగ్ ఎందుకంటే?
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రత్యేక మెజారిటీ అనే విధానం ఎందుకు అమలు చేస్తారంటే, ఈ పదవి కీలకమైన రాజ్యాంగ పదవి. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని చెప్పడానికి ఈ పద్ధతిని అమలు చేస్తారు. ఉపరాష్ట్రపతి తన రాజ్యాంగ పదవి రీత్యా రాజ్యసభ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. రాజ్యసభ కార్యకలాపాలను నిర్వర్తిస్తారు. ఇలా ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం వల్ల అన్ని పార్టీల నుండి ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం లభిస్తుంది. రాజ్యాంగబద్ధమైన స్థిరత్వం ఆ పదవికి ఉంటుంది. ఇక సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటింగ్ విధానం వల్ల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కేవలం ఒక పార్టీ మద్దతు కాకుండా, ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడా రెండో, మూడో ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలుపుకు ఉపయోగపడతాయి. ఇలా చేయడం వల్ల అన్ని పార్టీల మద్దతు ఉపరాష్ట్రపతికి ఉంటుందనే ఆలోచనతో రాజ్యాంగ కర్తలు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు.
ఇలా ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యే అభ్యర్థి ప్రత్యేక మెజారిటీ, సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ పద్ధతుల ద్వారా విజేతగా నిలుస్తారు. ఇది మన రాజ్యాంగంలో కీలకమైన ఎన్నికల విధానంగా చెప్పవచ్చు






















