Congress Meeting : పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రక్షాళన - ప్రధాన కార్యదర్శుల భేటీలో కీలక నిర్ణయాలు !
కాంగ్రెస్‌లో పూర్తి స్థాయి ప్రక్షాళనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమాలను నిర్మించనున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ( AICC ) ప్రధాన కార్యదర్శులు , ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్ లతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. సోనియా, ప్రియాంకా గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసిసిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. సంస్థాగత మార్పుల గురించి ఈ మీటింగ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గ్రౌండ్ లెవల్ వరకూ పార్టీలో సమూల మార్పు రావల్సి ఉందని.. ఏఐసీసీ నేతలు అభిప్రాయపడుతుతున్నారు. అంతర్గత సంస్కరణలు అత్యంత వేగంగా తీసుకు రాకుంటే.. పరాజయ పరంపర కొనసాగుతుందని పార్టీలో ఆందోళన కనిపిస్తోంది.
గుజరాత్‌లో కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిషోర్ ? మోడీ, షాలకు చెక్ పెడతారా ?
కాంగ్రెస్ పార్టీకి (Congress Party ) కొత్తరూపు ఇవ్వాలని సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారు. జీ - 23 నేతలతో కూడా సోనియా (Sonia ) ఇటీవల సమావేశం అయ్యారు. వారిని కూడా పార్టీలో కీలకం కేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో (Karnataka Elections ) పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్ ఇవ్వనున్నారు. ఆగస్టు-సెప్టెంబర్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సోనియా నిర్ణయించారు. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సమూల ప్రక్షాళన చేయడానికి అధిష్టానం కసరత్తు చేస్తోంది.
సమావేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పాటు తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించారు. పార్టీ సభ్యత్వ (MemberShip ) నమోదు కార్యక్రమం పురోగతిని సమీక్షించడంతో పాటు దేశవ్యాప్తంగా మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి పార్టీ నేతలతో చర్చించారు. త్వరలో భారీ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అతి త్వరలో ప్రకటించనున్నారు. ధరల పెరుగుదలపై దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు.
వరుస ఓటములతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తి జవసత్వాలు ఇవ్వాలన్న ప్రయత్నాన్ని సోనియా గాంధీ చేస్తున్నారు. అసంతృప్త నేతలను మళ్లీ దగ్గరకు చేసుకుని వారికి పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వడమే కాదు.. దేశవ్యాప్తంగా మోదీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ద్వారా త్వరలో జరగనున్న రాష్ట్రాలు... ఆతర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఫలితం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది.