Skyroot Vikram-1 launch: స్కైరూట్ విక్రమ్-1 ప్రయోగం నిలిపివేత! టెక్నికల్ సమస్యతో ఆఖరి నిమిషంలో క్యాన్సిల్!
Skyroot Vikram-1 launch:స్పేస్ క్యాబ్ సేవలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ అంతరిక్ష కేంద్ర సరికొత్త ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిపివేశారు. టెక్నికల్ సమస్య కారణంగా విక్రమ్-1 ప్రయోగం ఆగిపోయింది.

- విక్రమ్-1 రాకెట్ ప్రయోగం శ్రీహరికోటలో సాంకేతిక లోపాలతో వాయిదాపడింది.
- ఇది స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ప్రైవేటు రంగ ఉపగ్రహ వాహకనౌక.
- మిషన్ 'ఆగమన్' చిన్న ఉపగ్రహ మార్కెట్లో భారత్‌కు బలం చేకూరుస్తుంది.
- ప్రధాని మోడీ 'వందేమాతరం' సందేశం, శాస్త్రవేత్తల సంతకాలు మోసుకెళ్తుంది.
Skyroot Vikram-1 launch: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో ఉన్న సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-1 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. సాంకేతిక సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం ఈ రాకెట్‌కు విక్రమ్ అని పేరు పెట్టారు.
విక్రమ్-1 ప్రత్యేకత ఏంటి?
విక్రమ్-1 అనేది పూర్తిగా ప్రైవేటు రంగంలో రూపొందించిందీ రాకెట్. ఇది ఒక ఆర్బిటల్ తరగతి రాకెట్. దీని నిర్మాణం, సాంకేతికతలో అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఇందులో స్వదేశీ టెక్నాలజీతోపాటు త్రీడీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లు, హై- థ్రస్ట్ సాలిడ్ రాకెట్లను వాడారు. ఇది మొత్తం ఏడు అంతస్తులు ఉంటుంది. బరువు తగ్గించడానికి పూర్తిగా కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్‌తో రూపొందించారు. ఇది సుమారు 350 నుంచి 450 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు సిద్దమైంది.
అంతరిక్షంలో ఉబర్ లాంటి సేవలు
విక్రమ్-1ను అంతరిక్ష నిపుణులు అల్టిమేట్ క్యాబ్ టు ఆర్బిట్ అని పిలుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించాలి అంటే పెద్ద రాకెట్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అంటే మనం ట్రైన్, బస్‌ల కోసం ఎదురు చూస్తున్నట్టు. కానీ స్కైరూట్ అందిస్తున్న సేవలు మాత్రం ఉబర్ లాంటివి అన్నమాట. అంటే శాటిలైట్ ఆపరేటర్లు తమకు కావాల్సినప్పుడు కక్షలోకి ఉపగ్రహాలను పంపుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువే.
మిషన్ ఆగమన్ లక్ష్యాలు
ఈ ప్రయోగానికి ఆగమన్ అని పేరు పెట్టారు. అంటే స్పేస్‌లో ప్రైవేటు కంపెనీల రాకను చెప్పేందుకు ఈ పేరు పెట్టారు. రాకెట్ ప్రొపల్షన్ స్టేజ్ సెపరేషన్, నావిగేషన్, ఏవియానిక్స్ వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో డేటాను సేకరిస్తారు. చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్‌లో భారత్ సత్తా చాటేందుకు ఈ మిషన్ చేపట్టారు. అంతే కాకుండా ఇస్రోపై ఉన్న భారాన్ని కూడా తగ్గించే పనిలో ప్రభుత్వం ఉంది.
నింగిలోకి మోదీ సందేశం
ఈ రాకెట్ ద్వారా ప్రధానమంత్రి మోదీ రాసిన వందేమాతరం అనే సందేశాన్ని పంపించేందుకు సిద్ధమయ్యారు. . పోస్టుకార్డులో ఆయన ఈ మెసేజ్‌ను రాశారు. దీంతోపాటు మాజీ ఇస్రో ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, స్కైరూట్ ఇంజనీర్ల సంతకాలు, సందేశాలను కూడా తీసుకెళ్లనున్నారు.
స్కైరూట్ ఎవరు? ఎందుకు ఏర్పాటు చేశారు?
స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభత్ డాకా ఇద్దరూ ఒకప్పుడు ఇస్రోలో పని చేశారు. భారత్‌లో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం పెంచాలనే ఆలోచనతో వీరు తమ ఉద్యోగాలను వదిలేసి స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. వీళ్లు నాలుగేళ్ల క్రితం 2022లో విక్రమ్-ఎస్ అనే సబ్ ఆర్బిట్ రాకెటను విజయవంతంగా ప్రయోగించారు.
ఇప్పుడు ఈ ప్రయోగంతో చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్‌లో భారత్ శక్తివంతమైన దేశంగా మారే ఛాన్స్ ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కొత్త పుంతల తొక్కేందుకు మిషన్ ఆగమన్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుందని భావించారు. కానీ చివరి నిమిషంలో ప్రయోగం నిలిపేశారు.
ట్రెండింగ్ వార్తలు






















