Zika Virus: పుణెలో జికా వైరస్ కలకలం - ఆరుగురికి పాజిటివ్ నిర్ధారణ, రోగుల్లో ఇద్దరు గర్భిణులు
Zika Virus Cases In Pune: పుణెలో జికా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ ఆరుగురికి ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితులు ఇద్దరు గర్భిణులు సైతం ఉన్నారు.
Six Zika Virus Cases Reported In Pune: మహారాష్ట్రలోని పుణెలో (Pune) జికా వైరస్ (Zika Virus) ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఆరు ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. అరంద్వానే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గర్భిణీకి, అలాగే మరో గర్భిణీకి సైతం పాటిజివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. నిజానికి గర్భిణీలకు జికా వైరస్ సోకినట్లయితే.. పిండంలో మైక్రోసెఫాలి సంభవించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఈ స్థితిలో మెదడు అసాధారణంగా అభివృద్ధి చెంది తల చాలా చిన్నదిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దోమలను అరికట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.
తొలి కేసు అక్కడే
పుణెలోని అరంద్వానేలోనే జికా వైరస్ తొలి కేసు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఓ 46 ఏళ్ల వైద్యునికి జికా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన కుమార్తెకు (15) సైతం వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరితో పాటు ముండ్వా ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల మహిళకు, 22 ఏళ్ల వ్యక్తికి జికా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరు నలుగురితో పాటు అరంద్వానేలోనే ఇద్దరు గర్భిణులకు సైతం వైరస్ సోకింది. బాధితులంతా పుణెలోని వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ దోమ డెంగ్యూ, చికున్ గున్యా వంటి వైరస్‌లను సైతం వ్యాప్తి చేస్తుంది. 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో తొలిసారిగా ఈ వైరస్ గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతో సహా భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, దగ్గు, గొంతునొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలని వైద్యులు తెలిపారు.
Also Read: Viral Video: జలపాతంలో పడి కొట్టుకుపోయిన కుటుంబం, సాయం కోసం ఆర్తనాదాలు - క్షణాల్లో గల్లంతు