బ్రిజ్ భూషణ్ సింగ్ ఇంటికి వెళ్లిన సిట్, కుటుంబ సభ్యులతో సహా 12 మంది వాంగ్మూలాలు నమోదు
ఢిల్లీ పోలీసులు గోండాలోని ఎంపీ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకు సంబంధించిన వారిని ప్రశ్నించి వాంగ్మూలాలను నమోదు చేశారు.
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. లైంగిక వేధింపులు సహా చాలా ఆరోపణలు చేసిన వేళ అతనిపై కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ధర్నా చేశారు.
రెజ్లర్ల ఆందోళనతో కేసు దర్యాప్తు కాస్త వేగం పుంజుకుంది. ఇప్పుడు ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసుల సిట్ యూపీలో పర్యటిస్తోంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులపై దర్యాప్తు చేస్తున్న సిట్... గోండాలోని ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పరిచయస్తుల నివాసానికి వెళ్లింది. ఆయన గత ప్రవర్తన, గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించింది. పలువురి వాంగ్మూలాలు నమోదు చేసింది.
ఢిల్లీ పోలీసు బృందం బ్రిజ్ భూషణ్ శరణ్ స్వగ్రామానికి చేరుకుని ఎంపీ సన్నిహితులు, సహచరులు, భద్రతా సిబ్బందితో సహా 12 మంది వాంగ్మూలాలను తీసుకుంది. గోండాకు చెందిన కొందరి పేర్లు, చిరునామాలు, మొబైల్ నంబర్లు, గుర్తింపు కార్డులను ఆధారాలుగా దర్యాప్తు బృందం సేకరించింది. ఆ తర్వాత ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనుంది
దేశవిదేశాల్లో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో బీజేపీ ఎంపీపై వచ్చిన ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. ఈ దర్యాప్తు చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రెజ్లర్లు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
మహిళా రెజ్లర్ల తరఫున ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు చాలా కాలంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తీవ్ర గందరగోళం నెలకొన్న టైంలో ఈ కేసులో నిందితుడైన ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. బీజేపీ ఎంపీపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఇప్పటికే ఏడుగురు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పోలీసులు వీరందరి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ కీలక పరిణామం జరిగింది. ఈ బాధితుల్లో మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చేసిన ఆరోపణల్ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. పటియాలా హౌజ్ కోర్ట్‌లో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్జ్ చేయగా...ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంది. ప్రస్తుతానికి బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదయ్యాయి. దాదాపు 10 కేసులు పెట్టారు పోలీసులు. ఈ FIRలో ఆ మైనర్ రెజ్లర్ కూడా పలు ఆరోపణలు చేసింది. చాలా సందర్భాల్లో తనను అసభ్యంగా తాకారని చెప్పింది. కావాలనే భుజంపై చేతులు వేసి ఎక్కడెక్కడో ముట్టుకున్నాడని తెలిపింది. "నువ్వు నాకు సపోర్ట్ చేస్తే...నేను నీకు సపోర్ట్ చేస్తా" అని చెప్పినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను 16 ఏళ్ల వయసులో ఉండగా ఇదంతా జరిగిందని చెప్పింది. తనతో సన్నిహితంగా ఉండకపోతే వచ్చే ఛాంపియన్‌షిప్‌లలో ఆడకుండా చేస్తానని బెదిరించినట్టు...ఆ మైనర్ రెజ్లర్ తండ్రి ఆరోపించారు. ఇన్ని ఆరోపణలు చేసి ఉన్నట్టుండి ఆమె తన స్టేట్‌మెంట్‌ని ఎందుకు వెనక్కి తీసుకుందన్నదే అంతు తేలకుండా ఉంది.