She Is A Man: నా భార్య స్త్రీ కాదు, న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన భర్త - విచారణకు ధర్మాసనం ఓకే
తనను మోసం చేసిన భార్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం అంగీకరించింది.
Husband Plea in Supreme Court She is a man: తన భార్య మిగతా అందరు మహిళల్లా కాదని ఆమెకు పురుష జననాంగాలు ఉన్నాయని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను మోసం చేసిన భార్యపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం అంగీకరించింది.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం మొదట ఈ పిటిషన్‌ను స్వీకరణకు అంగీకరించలేదు. అయితే తన భార్యకు పురుషాంగం, హైమెన్ ఉందని వైద్య నివేదికను బాధితుడు బహిర్గతం చేయడంతో భార్య నుంచి ప్రతిస్పందనను కోరారు. అసంపూర్తిగా ఉన్న హైమెన్ పుట్టుకతో వచ్చే సమస్య అని, అది యోనిని పూర్తిగా కప్పి ఉంచుతుందని పలు వివరాలు సుప్రీంకోర్టుకు సమర్పించడంతో విచారణ చేపట్టడానికి అంగీకారం తెలిపింది.
భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code)ప్రకారం భార్య పురుషుడిగా మారినందుకుగానూ ఆమెపై సెక్షన్ 420 కింద క్రిమినల్ నేరం చేసినట్లు పరిగణించాలని భర్త తరఫు లాయర్ ఎన్‌కె మోడీ ధర్మాసనానికి తెలిపారు. ఆమె మహిళ కాదు. కనుక బాధితుడికి కచ్చితంగా అన్యాయం జరిగింది. ఇది పుట్టుకతో వచ్చే సమస్య కాదని, ఆమెకు తన జననాంగాల గురించి తెలిసి తన క్లయింట్‌ను ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్లు కోర్టుకు విన్నవించారు. మోసం చేశారని అభియోగాలపై గతంలో మహిళకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయగా.. జూన్ 2021లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ ఉత్వర్వులను రద్దు చేయడాన్ని బాధితుడి తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఆమె స్త్రీ కాదని నిరూపించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని తన వాదన వినిపించారు.
ఇంపర్‌ఫోరెట్ హైమెన్ ఉన్న కారణంగా ఆమె స్త్రీ కాదని ఎలా చెబుతారని ధర్మాసనం లాయర్ మోదీని ప్రశ్నించింది. ఆమె అండాశయాలతో పాటు పురుషాంగం కూడా ఉందని మెడికల్ రిపోర్టులో తేలినట్లు కోర్టుకు భర్త తరఫు లాయర్ చెప్పారు. మీ క్లయింట్ ఏం కోరుకుంటున్నారని ధర్మాసనం అడిగింది. తన క్లయింట్ నమోదు చేసిన కేసుపై విచారణ చేపట్టి అతడికి న్యాయం చేయాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించారు. పురుషాంగం కలిగి ఉండి మహిళగా తనను మోసం చేసి వివాహం చేసుకున్నందుకు ఆమెతో పాటు తన మామపై సైతం చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరినట్లు లాయర్ స్పష్టం చేశారు. తన క్లయింట్‌పై సైతం ఐపీసీ సెక్షన్ 498A (క్రూరత్వం) కింద కేసు నమోదు చేశారని, దీన్ని కొట్టివేయాలని కోరారు.
భార్యకు నోటీసులు..
ఈ కేసుపై ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భార్య, ఆమె తండ్రి, మధ్యప్రదేశ్ పోలీసులకు సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. భార్య తనను మోసం చేసిందని మే 2019లో గ్వాలియర్ మేజిస్ట్రేట్‌ను బాధితుడు ఆశ్రయించాడు. 2016లో వివాహం జరిగిన తర్వాత భార్యకు పురుష జననాంగం ఉందని ఇది తనను మోసం చేయడమేనని పేర్కొంటూ భార్య, ఆమె తండ్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆగస్టు 2017లో మేజిస్ట్రేట్‌ను కోరాడు. అదనపు కట్నం కోసం అల్లుడు తన కూతురిపై ఆరోపణలు చేస్తున్నారని, అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. గ్వాలియర్‌లోని ఓ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేసిన తరువాత బాధితుడి భార్య, ఆమె తండ్రికి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన వివాహిత..
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లపై అతడి భార్య, ఆమె తండ్రి జూన్ 2021లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మోసం చేసినట్లు భావించలేమని మేజిస్ట్రేట్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హిందూ వివాహ చట్టం ప్రకారం, క్రూరత్వం - మానసిక, శారీరక వేధింపులు విడాకులకు కారణం అవుతాయని పేర్కొంది. మానసిక వైకల్యం, లైంగిక వ్యాధి, విడిచిపెట్టడం, వేధింపుల లాంటి కారణాలతో విడాకులు తీసుకుంటారు.
ఈ కేసుపై లింగ నిర్ధారణ నిపుణుడు డేనియెల్లా మెండోంకా స్పందించారు. అసంపూర్తిగా ఉన్న హైమెన్‌ని ఇంటర్‌సెక్స్ అని చెప్పవచ్చు. అదే సమయంలో లింగ నిర్ధారణ అనేది పురుషుడు, స్త్రీ, ట్రాన్స్ అనేది జననాంగాలతో సంబంధం లేకుండా వారి స్వీయ గుర్తింపుపై ఆధారపడి ఉంటుందన్నారు. 2014 యూనియన్ ఆఫ్ ఇండియా v నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (National Legal Services Authority) తీర్పులో సుప్రీం కోర్ట్ దీన్ని సమర్థించినట్లు తెలిపారు.
లైంగికతకు సంబంధించిన చట్టపరమైన సమస్యలపై పోరాడే లాయర్ సాతియా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తీర్పుపై స్పందించారు. జనన అంగాలతో సంబంధం లేకుండా, ఒక వ్యక్తి యొక్క లింగ నిర్ధారణ పురుషుడు, స్త్రీ, ట్రాన్స్ జెండర్ అనేది వారి సొంత గుర్తింపుపై ఆధారపడి ఉంటుందని తీర్పు స్పష్టంగా ఉందని గుర్తుచేశారు పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం ఓ వ్యక్తి తన సొంత లింగ నిర్ధారణ హక్కు ఉందని స్పష్టం చేశారు.