Nipah Cases: కేరళలో సున్నా నిఫా కేసులు నమోదు, కోజికోడ్‌లో ఆంక్షల సడలింపు
Nipah Cases: కేరళలో నిఫా కేసులు నమోదు కాకపోవడంతో క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు.
Nipah Cases: కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో కొత్తగా నిఫా కేసులేవీ నమోదు కాలేదు. దీంతో కోజికోడ్ జిల్లాలోని పలు పంచాయతీల్లో ఆంక్షలు సడలించినట్లు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కేరళ రాష్ట్రంలో కొత్తగా నిఫా కేసులు నమోదు కాలేదు. హై రిస్క్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న 218 మంది నమూనాలను పరీక్షించగా.. నెగెటివ్ వచ్చినట్లు రాష్ట్ర సర్కారు వెల్లడించింది.
కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో కోజికోడ్ జిల్లాలోని 53 వార్డులు, పంచాయతీల్లో ఆంక్షలను సడలించినట్లు పినరయి విజయన్ సర్కారు తెలిపింది. ఇక నుంచి కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దుకాణాలను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని అధికారులు ప్రకటించారు. బ్యాంకు సేవల సమయాన్ని కూడా పెంచారు. మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు తెరిచి ఉంటాయని అధికారులు తెలిపారు. అయితే నిఫా వైరస్ నుంచి రక్షణ కోసం కచ్చితంగా మాస్కులు ధరించాలని, సానిటైజర్లు ఉపయోగించాలనని, ఇతరులతో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ప్రకటన వచ్చేంత వరకు ఈ ఆంక్షలు అమలు అవుతాయని తెలిపింది. నిఫా సోకిన వారు, ప్రయోగ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభుత్వం విధించిన కఠినమైన ఆంక్షలు పాటించాలని పేర్కొంది. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు క్వారంటైన్ లో ఉండాలని కోజికోడ్ జిల్లా కలెక్టర్ సూచించారు.
కొవిడ్ కంటే ప్రమాదకరం..
నిఫా ప్రాణాంతక వ్యాధి అంటోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. కొవిడ్ కంటే నిఫా వైరస్ చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తోంది.నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇస్తోంది. నిఫా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిని గట్టిగా చెప్పారు... ఐసీఎంఆర్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డాక్టర్. రాజీవ్ బాల్. కోవిడ్ మరణాలతో పోలిస్తే నిఫా వైరస్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. కొవిడ్ వైరస్ వల్ల 2 నుంచి 3 శాతం మరణాలు సంభవిస్తే.. నిఫా వైరస్ వల్ల 40 నుంచి 70 శాతం మరణాలు నమోదవుతాయని చెప్పారు. ప్రారంభదశలోనే నిఫా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయాలని.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిఫా వైరస్ బాధితులకు చేసే చికిత్సలో మోనోక్లీనల్ యాంటీబాడీ మందు ముఖ్యమైనది చెప్పారు ICMR డీజీ. అయితే.. ప్రస్తుతం తమ దగ్గర 10 మంది రోగులకు సరిపడే మోనోక్లీనల్ యాంటీబాడీ మందు మాత్రమే ఉందన్నారు. మరో 20 డోసులను కొనుగోలు చేస్తామన్నారు. 2018 నుంచే మోనోక్లీనల్ యాంటీబాడీ మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారాయన. మన దేశంలో ఇప్పటివరకు నిఫా వైరస్ రోగుల్లో ఒక్కరికి కూడా మోనోక్లీనల్ యాంటీబాడీల మందును ఇవ్వలేదు. విదేశాల్లోని 14 మంది నిఫా రోగులకు మోనోక్లీనల్ యాంటీబాడీలు ఇచ్చామని.. వారందరూ కోలుకున్నారని చెప్పారు డాక్టర్ బాల్. అయితే... వైరస్ సోకిన వెంటనే ఈ మందు ఇవ్వాలని.. అప్పుడే పేషంట్ కోలుకుంటాడని చెప్తున్నారు.
వర్షాకాలంలోనే నిఫా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బాల్ తెలిపారు. కేరళలో ఆరు నిఫా కేసులు వెలుగుచూడంతో.. వారి చికిత్సపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే.. కేరళలోని నిఫా రోగులకు మోనోక్లీనల్ యాంటీబాడీలు ఉపయోగించాలనే నిర్ణయం.. వైద్యులు, రోగులు, వారి కుటుంబసభ్యులతో పాటు కేరళ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ మెడిసిన్‌పై ట్రయల్స్ ఒక లెవల్‌లో మాత్రమే జరిగాయని.. ఎఫిషియన్సీ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.