Tamil Nadu Rains: మూడు రోజుల్లో తుపాన్-తమిళనాడుకు రెడ్ అలర్ట్
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకా నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Tamil Nadu Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై(Chennai)తోపాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు నరకం చూశారు. ఇదిలా ఉంటే... నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(IMD) అంచనా వేసింది. తిరువళ్లూరు (Tiruvallur), కాంచీపురం(Kanchipuram), చెంగల్పట్టు (Chengalpattu), నాగపట్నం (Nagapatnam), రామనాథపురం (Ramanathapuram), చెన్నై(Chennai) ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
భారీ వర్షాల కురుస్తున్న చెన్నైతోపాటు ఇతర జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వలేదు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. చెంబరంబాక్కం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో కాంచీపురం జిల్లాలోని అడయార్ నది ఒడ్డున ఉన్న ఆరు గ్రామాలను వరద ముంచెత్తింది. ఇక, తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా... పుఝల్ సరస్సు నిండిపోయింది. నిన్న ఆ సరస్సు నుంచి దాదాపు 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా గుర్తించబడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం డిసెంబరు 3 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని.. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజామున తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకుంటుందని హెచ్చరించింది.
భారీ వర్షాల కారణంగా.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నై కార్పొరేషన్ ప్రారంభించిన 1913 హెల్ప్‌లైన్‌కు నుండి వచ్చిన కాల్స్‌కు కూడా సమాధానం ఇచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. వచ్చిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
భారత వాతావరణ విభాగం తమిళనాడుతోపాటు.. ఆంధ్రప్రదేశ్‌ను కూడా అలర్ట్ చేసింది. రేపటి నుంచి డిసెంబర్ 4వ తేదీ మధ్య కోస్తా తమిళనాడు, పుదుఛ్చేరి, కారైకాల్, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కేరళ, పుదుచ్చేరి, కారైకల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కి కూడా తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌తో బలపడనుండటంతో మూడు నాలుగు రోజుల పాటు కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు కురువనున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో... ఇటు తమిళనాడు... ఇటు ఆంధ్ర్రప్రదేశ్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షాలతో బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఇక... మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురవనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. సహాయక బృందాలను కూడా సిద్ధం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు.