Priyanka Gandhi From Varanasi: వారణాసి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదన
80 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ పై ఇండియా కూటమి గురి పెట్టింది. అందులో భాగంగా వారణాసి నుంచి ప్రియాంకా గాంధీని బరిలోకి దించేందుకు ఎత్తులు వేస్తున్నాయి.
![Priyanka Gandhi From Varanasi: వారణాసి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదన Priyanka Gandhi Vadra Should Contest from Varanasi West Bengal CM Mamata proposal Priyanka Gandhi From Varanasi: వారణాసి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/36d24e4dec29edeba0f9047aaea9560a1703081443439840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Parliament Elections 2024 : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా I.N.D.I.A కూటమి (I.N.D.I.A Allaince) వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాటం చేసి, బీజేపీ కూటమిని ఓడించాలన్న లక్ష్యంగా I.N.D.I.A కూటమి పని చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కూటమి ముందుగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో మెజార్టీ సీట్లు సాధించాల్సి ఉంది. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి (Varanasi) పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi Vadra) పోటీ చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదన చేశారు.
జనవరి రెండోవారంలోపు సీట్ల పంపకాలు
కూటమిలోని పార్టీల మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి, ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చాయి. వచ్చే ఏడాది జనవరిలో సీట్ల పంపకాలను ఫైనల్ చేయాలని ఇప్పటికే కూటమి నిర్ణయించింది. 80 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ పై I.N.D.I.A కూటమి గురి పెట్టింది. అందులో భాగంగా వారణాసి నుంచి ప్రియాంకా గాంధీని బరిలోకి దించేందుకు ఎత్తులు వేస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయడంతో...రాష్ట్ర మొత్తం ఆ ప్రభావం పని చేసింది. దీంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీకి 62 సీట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో 71 స్థానాల్లో విజయం సాధించింది.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రచారం
నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ, ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేశారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తెలంగాణ, రాజస్థాన్, మణిపుర్ ఎన్నికల్లోపార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే వారణాసి నుంచి ప్రియాంక గాంధీని నిలబెడతారనే ప్రచారం జరిగింది. అయితే అజయ్ రాయ్‌ని పోటీకి దించింది హస్తం పార్టీ. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీ అశోకా హోటల్ లో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రాతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రియాంకా గాంధీని వారణాసి నుంచి బరిలోకి దించితే, పార్టీకి మెరుగైన సీట్లు వస్తాయని చెప్పినట్లు సమాచారం.
జనవరి మొదటి వారంలో సీట్ల పంపకాలు
2024 జనవరి మొదటి వారంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంపీలు ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. తొలుత తాము గెలిచి మెజార్టీ సాధించాలని.. ఆ తర్వాతే ఎంపీలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఎంపీల సస్పెన్షన్‌పై డిసెంబర్ 22న దేశ వ్యాప్త నిరసనకు దిగాలని ఇండియా కూటమి నిర్ణయించింది. సీట్ల పంపకాలు రాష్ట్ర స్థాయిల్లోనే జరుగుతాయని, అక్కడ ఏదైనా సమస్యలు వస్తే కేంద్ర స్థాయిలో చర్చలు జరిపి అంగీకారానికి వస్తామన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, బిహార్, యూపీ, ఢిల్లీ లేదా పంజాబ్ ఎక్కడైనా సరే సీట్ల పంపకంలో సమస్యలు రాకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)