PM open letter to people:దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే!
Modi Letter To Public: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం చేసిన పనులు తెలిపారు.
PM Modi Open Letter To People: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు(Elections 2024) ప్రారంభంకానున్న సమయంలో ప్రధానమంత్రి(Prime minister) నరేంద్ర మోడీ(Narendra Modi) దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం రాత్రి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలను తన కుటుంబంగా పేర్కొన్న ఆయన అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వివరించారు. తన నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేసిన తీరును, సాధించిన కీలక విజయాలను, ప్రవేశ పెట్టిన అనేక పథకాలను ఈ లేఖలో ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు ప్రజల మద్దతు సంపూర్ణంగా లభించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
మీరంతా నా కుటుంబం
దేశ ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన కుటుంబంగా పేర్కొన్నారు. "పది సంవత్సరాలపాటు భారతదేశ పౌరులకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. నా పదవీ కాలంలో నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రోత్సహించిన 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసం, మద్దతును మరువలేను. పేదలు, రైతులు, యువత, మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కట్టుబడి పనిచేశాం. ఒక దృఢ నిశ్చయంతో నిర్ణయాలు తీసుకున్నాం. ప్రభుత్వ సమష్టి ప్రయత్నాల కారణంగా ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు కనిపించాయి."
ప్రజల మద్దతు అమోఘం
కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు అన్ని రూపాల్లోనూ మద్దతు తెలిపారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. "ప్రజల మద్దతు అమోఘం. ఈ పది సంవత్సరాల్లో అనేక కీలక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. పేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో చేపట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(Pradhan Mantri Awas Yojana) లక్షలాది మందికి సొంతింటి కలను నెరవేర్చింది. మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ కనెక్షన్లను అందించాం. నీరు, ఎల్‌పీజీ కనెక్షన్లు వంటివి చేరాయి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్న సంకల్పంతో ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat)ను తీసుకువచ్చాం. అదేవిధంగా రైతులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలిచాం. మాతృవందన యోజన(Matru Vandana Yojana) ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ కార్యక్రమాలు సాధించడం వెనుక దేశ ప్రజల విశ్వాసం.. వారి అచంచెల మద్దతు ఉంది".
ప్రభుత్వ నిబద్ధత ఇదీ..
సాంప్రదాయం ఆధునికతను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు, "మౌలిక సదుపాయాల అభివృద్ధి, భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంపై ఏకకాలంలో దృష్టి పెట్టడం దీనికి నిదర్శనం. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవిస్తూ దీని పురోగతికి ఎన్నో చర్యలు తీసుకున్నాం. దీనిని దేశ పౌరులు గర్వకారణంగా భావిస్తున్నారు."
అనేక చరిత్రాత్మక నిర్ణయాలు
గడిచిన పదేళ్ల కాలంలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendramodi) తన లేఖలో వివరించారు. "జిఎస్‌టి అమలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌పై కొత్త చట్టం, పార్లమెంట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే చట్టం, తీవ్రవాదం, నక్సలిజం అణిచివేత వంటి విషయాల్లో నిర్ణయాత్మక చర్యలతో సహా ప్రభుత్వం తీసుకున్న అనేక చారిత్రక, ముఖ్యమైన నిర్ణయాలు ప్రజల మద్దతుతోనే చేపట్టాం. దేశ సంక్షేమం కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, దేశ అభివృద్ధి కోసం ఆకాంక్షించే ప్రణాళికలను సాకారం చేయడానికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది." ఇదే తనకు మరోసారి అధికారం ఇస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యతపై తన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ప్రతి పౌరుడికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో దేశ సామూహిక సామర్థ్యంపై విశ్వాసం ఉందన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendramodi) సుదీర్ఘ లేఖలో వివరించారు.