పాత పార్లమెంటు భవనం రాబోయే తరానికి స్ఫూర్తి: ప్రధాని మోదీ
దేశ ప్రజల చెమట, రక్తంతో పార్లమెంట్ భవనం నిర్మించారని అభిప్రాయపడ్డారు మోదీ. స్వాతంత్య్రానంతరం ఈ భవనానికి పార్లమెంట్ హౌస్ అనే గుర్తింపు వచ్చిందన్నారు.
కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగు పెట్టే ముందు దేశ పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుందామన్నారు ప్రధాన మంత్రి మోదీ. మనమంతా ఈ చారిత్రాత్మక భవనాన్ని వీడుతున్నామని ప్రకటించారు. దేశ ప్రజల చెమట, రక్తంతో ఈ భవనం నిర్మించారని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రానంతరం ఈ భవనానికి పార్లమెంట్ హౌస్ అనే గుర్తింపు వచ్చిందన్నారు. పాత పార్లమెంటు భవనం రాబోయే తరానికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'భారతదేశం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రయాన్-3 విజయంతో యావత్ దేశం వేడుక చేసుకుంటుంది. దీని ద్వారా సైన్స్‌లో దేశ సత్తా చాటి చెప్పాం. ఇదంతా మన శాస్త్రవేత్తల సామర్థ్యంతో సాధ్యమైంది. దీని ఎఫెక్ట్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది.
'జీ-20 విజయం భారత్ విజయం. ఇది ఏ వ్యక్తి లేదా పార్టీ విజయం కాదు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణం. గత 75 ఏళ్లలో స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన అనేక ఘటనలు ఈ సభలో జరిగాయి. 600 మంది మహిళా ఎంపీలు సభ గౌరవాన్ని పెంచారు. తొలిసారి ఎంపీగా వచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేవాలయానికి నమస్కరించి భవనంలో అడుగుపెట్టాను.
దేశం మనకు ఇంత గౌరవం ఇస్తుందని ఊహించలేదన్నారు. పేదింట పుట్టిన బిడ్డ ఎంపీ అవుతాడని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అదే భారత ప్రజాస్వామ్యానికి ఉన్న బలం అన్నారు. నేడు ప్రపంచం భారత్‌లో మంచి స్నేహితుడిని చూస్తోందని చెప్పారు.
పార్లమెంట్ పై ఉగ్రదాడిని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
పార్లమెంట్ సజావుగా సాగేందుకు లెక్కలేనన్ని మంది సహకరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రజాస్వామ్య సభపై కూడా ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి పార్లమెంటుపై కాదు, మన ఆత్మపై జరిగింది. దాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. సభను కాపాడేందుకు ఛాతీలో బుల్లెట్లు దిగినా ఉగ్రవాదులతో పోరాడిన అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నాను.