PM Modi Italy Tour: ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనకు నరేంద్ర మోదీ, జీ7 సదస్సుకు హాజరు
Narendra Modi: ప్రధాన మంత్రి మోడీ మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. G-7 దేశాల కీలక సదస్సులో పాల్గొనేందుకు ఇటలీలో పర్యటించనున్నారు.
![PM Modi Italy Tour: ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనకు నరేంద్ర మోదీ, జీ7 సదస్సుకు హాజరు PM Modi Italy Tour Prime minister will attend G7 summit from 13 June 2024 PM Modi Italy Tour: ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనకు నరేంద్ర మోదీ, జీ7 సదస్సుకు హాజరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/1b53097289d5891a81dab3ce48c8af331718222847564233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi: భారత ప్రధానిగా వరుసగా మూడో సారి నరేంద్ర మోడీ(Prime minister Narendra Modi) ఈ నెల 9న బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన తన మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 100 రోజుల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుని.. ఆమేరకు కార్యాచరణను కూడా తొలి కేబినెట్‌లోనే సూచించారు. ఇక, ఇప్పుడు మూడో దశ పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 13(గురువారం) నుంచి తొలి విదేశీ పర్యటన చేయనున్నారు. ఇటలీ(Italy)లో జరగనున్న G-7 దేశాల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సులో `అధునాతన ఆర్థికవ్యవస్థల నిర్మాణం` అనే అంశంపై G-7 దేశాలు చర్చించనున్నాయి. ఇటలీలో జరుగుతున్న ఈ సదస్సు వార్షిక శిఖరాగ్ర సదస్సు కావడం గమనార్హం.
G-7 దేశాల శిఖరాగ్ర సదస్సు
ఇటలీలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతంగా పేరున్న `అపూలియా`(Apulia) ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియాలో ఈ నెల 13 నుంచి 15 తేదీ వరకు G-7 దేశాల శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు. G-7 దేశాల ఆర్థిక వ్యవస్థ ల బలోపేతంతో పాటు.. సమకాలీన సమస్యలపైనా ఆయా దేశాల అధినాయకులు చర్చించనున్నారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధంపై దృష్టి పెట్టనున్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ దాడి, గాజా సంఘర్షణ వంటి అంతర్జాతీయ అంశాలకు కూడా.. ఈ సదస్సులో ప్రాధాన్యం ఏర్పడింది. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సుస్థిరాభివృద్ధి ప్రణాళికలు, పర్యావరణ అంశాలపై కూడా.. G-7 దేశాల అధినేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు.
పాల్గొనే వారిలో ప్రముఖులు..
G-7 దేశాల వార్షిక శిఖరాగ్రసదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌లతోపాటు జపాన్ ప్రధాని ఫుమియో కిషిద, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తదితర దేశాల అగ్రనేతలు హాజరుకానున్నారు. అలాగే, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది. అదేవిధంగా రష్యా యుద్ధ బాధిత ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా దూకుడును ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కష్ట కాలంలో తమను ఆదుకుంటున్న దేశాలకు కృతజ్ఞతలు చెప్పడంతోపాటు మరింత సాయాన్ని కూడా ఆయన కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయమే ఇటలీ చేరుకుంటారు. అక్కడే మూడు రోజుల పాటు బస చేయనున్నట్టు తెలిసింది.
ఇటలీతో ప్రత్యేక చర్చలు
ఇటలీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు పలువురు నేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించను న్నారు.
మోడీ వెంట వెళ్లేది వీరే!
ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఇటలీకి వెళ్లనున్న వారిలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రా, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్‌లతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఉంది.
ఏమిటీ గ్రూప్ 7 (G7)?
గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) అనేది కెనడా, ఫ్రాన్స్ , జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలతో కూడిన పొలిటికల్, ఎకనామిక్ ఫోరమ్. ఇది బహుళత్వం, ఉదారవాద ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రభుత్వం, భాగస్వామ్య విలువల ప్రాతిపతికన ఏర్పడింది. 1973లో ఆర్థిక మంత్రుల తాత్కాలిక సమావేశం నుండి ఉద్భవించిన `G7` అప్పటి నుండి ప్రధాన ప్రపంచ సమస్యలకు, ముఖ్యంగా వాణిజ్యం, భద్రత, ఆర్థిక, వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను చర్చించడానికి, ఆయా దేశాల మధ్య సమన్వయం చేయడానికి అధికారిక, ఉన్నత స్థాయి వేదికగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)