PM Narendra Modi Address to the Nation: భారత్ శక్తిని బలంగా చూపాం- సైన్యానికి, శాస్త్రవేత్తలకు నా సెల్యూట్ : మోదీ
PM Narendra Modi Address to the Nation:ఆపరేషన్ సిందూర్ విజయంలో సైనికుల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాను. వారి ధైర్యసాహసాలను దేశంలోని ప్రతి తల్లి , సోదరికి అంకితం చేస్తున్నాను అని మోదీ అన్నారు.

PM Narendra Modi Address to the Nation: భారత్ పాకిస్థాన్ మధ్య పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి మాట్లాడారు. పహల్గాం దాడిపై వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడారు. అనంతర పరిణామాలపై ఇంత వరకు ఎక్కడా స్పందించలేదు. ఇప్పుడు తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పహల్గాం దాడికి ప్రతికారంగా పాకిస్థాన్‌లోను ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన సైనిక చర్య ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అనంతరం భారత్‌లో ఉన్న సైనిక స్థావరాలపై పాకిస్థాన్ దాడికి యత్నించి విఫలమైంది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది.
పాకిస్థాన్ ఎంచుకున్న మార్గంలో వెళ్లిన భారత్ గట్టిగానే బుద్ది చెప్పింది. వారి భాషలోనే వారికి బుద్ది చెప్పింది. కీలకమైన స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ విషయంపై ఎప్పటికప్పుడు విదేశాంగ ప్రధాన కార్యదర్శి మిస్త్రీ, త్రివిధ దళాధిపతులు, ఇతర అధికారులు మీడియాకు చెబుతూ వచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్థాన్ దాడి చేయడాన్ని భారత్ సీరియస్‌గా స్పందించింది. అమెరికా జోక్యంతో పరిస్థితి శాంతించినా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇన్ని గందరగోళ పరిస్థితులు ఉన్నందున ప్రధాన మంత్రి వాటిపై క్లారిటీ ఇచ్చారు. పహల్గాం దాడి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం వరకు ఏం జరిగిందో తెలిపారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మన దేశ శక్తిని ప్రపంచానికి చూపించాం- ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "కొన్ని రోజుల్లో మనమందరం దేశం శక్తిని, సంయమనాన్ని చూశాం. ముందుగా, ప్రతి భారతీయుడి తరపున మన భారత సైన్యానికి, మన నిఘా సంస్థలకు, మన శాస్త్రవేత్తలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆపరేషన్ సిందూర్ సాధించడంలో సైనికులు ప్రదర్శించిన అపారమైన ధైర్యసాహసాలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. వారి ధైర్యసాహసాలను మన దేశంలోని ప్రతి తల్లి, సోదరికి అంకితం చేస్తున్నాను."
ఆపరేషన్ సిందూర్ అనేది న్యాయం కోసం చేసిన ప్రతిజ్ఞ: మోదీ
ప్రధాని మోదీ మాట్లాడుతూ, "సైన్యం అపారమైన శౌర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదులను అంతం చేయడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. వారి కుటుంబాల ముందే సామాన్యులను చంపారు. దేశ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆపరేషన్ సిందూర్ అనేది న్యాయం కోసం చేసిన అతి పెద్ద ప్రతిజ్ఞ."
ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి: ప్రధాని మోదీ
"పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు చేశాయి. భారతదేశం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలదని ఉగ్రవాదులు ఊహించలేదు. దేశం అత్యున్నతంగా ఉన్నప్పుడు, ఇంత బలమైన నిర్ణయాలు తీసుకుంటారు" అని ప్రధాని మోదీ అన్నారు.
100 మందికిపైగా ఉగ్రవాదులను చంపాం: ప్రధాని
భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలదని ఉగ్రవాదులు ఊహించలేదు. మన సోదరీమణుల సౌభాగ్యాన్ని నాశనం ఉగ్రవాదులు చేశారు. కాబట్టి భారతదేశం ఉగ్రవాదుల దాక్కున్న ప్రదేశాలను గుర్తించి నాశనం చేసింది. భారత్ సైన్యం 100 మందికిపైగా భయంకరమైన ఉగ్రవాదులను చంపింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో పాకిస్తాన్ షాక్ అయింది.' అని ప్రధాని మోదీ అన్నారు.





















