ఒకే దేశం ఒకే ఎన్నికపై స్పీడ్ పెంచిన కేంద్రం, సెప్టెంబర్ 23న తొలిభేటీ
One Nation One Election: ఒకే దేశం ఒకే ఎన్నికపై సెప్టెంబర్ 23న రామ్‌నాథ్ కోవింద్ కమిటీ భేటీ కానుంది.
One Nation One Election:
ఒకే దేశం, ఒకే ఎన్నికపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిన ఈ కమిటీ...కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 23న తొలిసమావేశం నిర్వహించనున్నట్టు స్వయంగా రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా...రామ్‌నాథ్ చేసిన ఈ ప్రకటన ఆసక్తి రేపుతోంది.
#WATCH | On the 'One Nation, One Election' committee, former President and chairman of the committee, Ram Nath Kovind says "The First meeting will take place on 23rd September" pic.twitter.com/FU1gvzMi7j
— ANI (@ANI) September 16, 2023
సెప్టెంబర్ 1వ తేదీన ఈ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఇప్పటి వరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే విధానాన్ని చాలా ఏళ్లుగా అనుసరిస్తున్నారు. అయితే...ఇలా వేరువేరుగా కాకుండా ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలన్నదే ఒకే దేశం, ఒకే ఎన్నిక ముఖ్య లక్ష్యం. దాదాపు నెల రోజులుగా దీనిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నెల 18-22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లోనే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్‌ని ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే...లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. అయితే..ఈ బిల్ పాస్ అవ్వాలంటే లోక్‌సభ సభ్యుల్లో 67% మంది మద్దతు కావాలి. అటు రాజ్యసభలోనూ 67% మంది సపోర్ట్ అవసరం. ఇక 50% ఎమ్మెల్యేల మద్దతూ కావాల్సిందే. ఎలాగైనా ఈ బిల్‌ని పాస్ చేయించాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు ఖర్చూ తగ్గుతుందని చెబుతోంది.
కేంద్రం ఒకే దేశం, ఒకే ఎన్నికపై కసరత్తు చేస్తున్న క్రమంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ సంకేతాలిచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ఏమీ లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే అవకాశాలు కూడా లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వ గడువు ముగిసిపోయేంత వరకూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సేవ చేస్తారని వెల్లడించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముందస్తు ఎన్నికలు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుండటాన్ని కొట్టి పారేశారు.
"కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ వేసింది. ఆ తరవాత నిపుణులు కూర్చుని చర్చిస్తారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఎన్నో దఫాల చర్చల తరవాతే దీనిపై ఓ తుదినిర్ణయానికి వస్తారు. ఈ కమిటీలో ప్రతిపక్షాలకు చెందిన నేతలూ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు"
- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
Also Read: తమిళనాడు తెలంగాణల్లో NIA సోదాలు, భారీ ఉగ్రకుట్ర భగ్నం - పలువురి అరెస్ట్