Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు అదానీ గ్రూప్ ఉచితంగా విద్య అందించనుంది. ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
Odisha Train Accident: గత మూడు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా నిలిచింది ఒడిశా రైలు ప్రమాదం. ఈ దుర్ఘటనలో 277 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది ఈ రైలు ప్రమాదం. ఎంతో మంది తమ వారిని కోల్పోయారు. చిన్నా పెద్దా చాలా మంది చనిపోయారు. గుండెలవిసే రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటింది. ఈ ప్రమాదంలో పలువురు చిన్నారులు తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో తన వంతు సాయం చేసేందుకు బిలియనీర్, దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ముందుకొచ్చారు. ఈ దుర్భర స్థితిలో మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
పిల్లల విద్య బాధ్యత తీసుకున్న అదానీ గ్రూప్
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువు బాధ్యతను తాము తీసుకుంటామని గౌతమ్ అదానీ ప్రకటించారు. వారి చదువుకు అయ్యే ఖర్చునంతా తామే భరిస్తామన్నారు. ఉచితంగా విద్యను అందించి వారికి మంచి భవిష్యత్ కల్పిస్తామని చెప్పారు. ఈ మేరకు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో అందరం తీవ్రంగా కలత చెందాం. ఈ ఘోర దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పాఠశాల విద్యను అందించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంది. బాధితులను ఆదుకోవడం మనందరి ఉమ్మడి బాధ్యత. వారి కుటుంబాలకు, పిల్లలకు మంచి భవిష్యత్ అందించండి' అంటూ గౌతమ్ అదానీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं।
— Gautam Adani (@gautam_adani) June 4, 2023
हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा।
पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है।
ఇలా జరిగింది..
ఒడిశా రైల్వే ప్రమాదంపై ఉన్నతాధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటికే రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ "ఎలక్ట్రానిక్ ఇంటర్‌లింకింగ్ సిస్టమ్"లో లోపం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలిపారు. రైల్వే బోర్డ్ అధికారులు దీనిపై మరికొన్ని వివరాలు అందించారు. వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా చూస్తే.. ప్రమాదం జరిగిన బాలాసోర్‌లోని బహనగబజార్ వద్ద నాలుగు ట్రాక్‌లున్నాయి. ఇందులో మధ్యలో ఉన్న రెండు మెయిన్ లైన్స్. వీటికి రెండు వైపులా లూప్ లైన్స్ ఉన్నాయి. ఈ రెండు లూప్ లైన్స్‌లోనూ రెండు గూడ్స్ ట్రైన్‌లు ఐరన్ ఓర్ లోడ్‌తో ఉన్నాయి. అదే సమయానికి షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నై నుంచి హౌరా వైపు వస్తోంది. అటు బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా హౌరా నుంచి వస్తోంది. మధ్యలో ఉన్న రెండు మెయిన్ లైన్స్‌కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 126కిలోమీటర్ల వేగంతో వస్తోంది. సిగ్నలింగ్‌లో పొరపాటు వల్ల కోరమాండల్ లూప్‌లైన్‌లోకి వెళ్లి గూడ్స్‌ని ఢీకొట్టినట్టు రైల్వే బోర్డ్ అధికారులు వివరించారు. అయితే.. ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే జరిగిందని చెప్పడానికి లేదని వెల్లడించారు.