Dwarka Expressway: దేశంలోనే తొలి 8 లేన్ల హైవే, ఒక్కసారి ఎక్కితే వందేళ్లు గుర్తుండే అనుభూతి - నితిన్ గడ్కరీ
ఈ రహదారిని ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్నారని నితిన్ గడ్కరీ తెలిపారు. మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
దేశంలోనే మొట్టమొదటిసారి నిర్మాణం జరుగుతున్న 8 లేన్ల హైవేకు సంబంధించి ఓ గ్లింప్స్‌ను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ షేర్ చేశారు. ఈ హైవే పేరు ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే. నార్తర్న్ పెరిఫెరల్ రోడ్ లేదా ఎన్‌హెచ్ 248 - బీబీ (Northern Peripheral Road or NH 248-BB) అని కూడా పిలుస్తారు. ఢిల్లీలోని ద్వారక, గురుగ్రామ్‌లోని ఖేరీ దౌలా టోల్ ప్లాజాను కలుపుతూ 27.6 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ రహదారిని ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొంటున్నారని నితిన్ గడ్కరీ తెలిపారు. మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రహదారిపై ప్రయాణ అనుభూతిని ప్రజలు మరో వందేళ్లు గుర్తు ఉంచుకుంటారని అన్నారు.
Marvel of Engineering: The Dwarka Expressway! A State-of-the-Art Journey into the Future 🛣#DwarkaExpressway #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/Qhgd77WatW
— Nitin Gadkari (@nitin_gadkari) August 20, 2023
ద్వారకా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఇవీ
ఢిల్లీలోని ద్వారక నుంచి మానేసర్ మధ్య ప్రయాణ దూరాన్ని ఈ రహదారి కేవలం 15 నిమిషాలకు తగ్గిస్తుంది. అలాగే మానేసర్ నుంచి ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లో, మానేసర్ నుంచి సింఘు బోర్డర్ కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు
ఈ ద్వారక ఎక్స్‌ప్రెస్ నిర్మాణంలో రెండు లక్షల టన్నుల స్టీలు వాడారు. పారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్‌లో ఉన్న ఉక్కు కంటే అది 30 రెట్లు ఎక్కువ. ఇంకా 20 లక్షల క్యుబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ వాడారు. ఇది బుర్జ్ ఖలీఫా నిర్మాణంలో వాడిన కాంక్రీటు కంటే ఆరు రెట్లు ఎక్కువ.
ఈ ద్వారక ఎక్స్‌ప్రెస్ వే ఎన్‌హెచ్ 48 (పాత ఎన్‌హెచ్ 8) పై ఢిల్లీ మహిపాల్ పూర్‌లో శివమూర్తి వద్ద 20వ కిలో మీటర్ మార్క్ వద్ద ప్రారంభం అయి గురుగ్రామ్‌లోని ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద 40 కిలో మీటర్ మార్క్ వద్ద ముగుస్తుంది. ఢిల్లీ - గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేలో ట్రాఫిక్ అత్యధికంగా ఉన్నందున దాన్ని తగ్గించేందుకు ఈ అదనపు లింక్ రోడ్డును నిర్మిస్తున్నారు.
ఈ రహదారి అందుబాటులోకి వస్తే దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే అవనుంది. ఈ ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం కనీసం 1,200 చెట్లను అక్కడి నుంచే తీసేసి మరో చోట నాటారు. మరోవైపు, దేశంలోనే తొలి 8 లేన్ల 3.6 కిలో మీటర్ల పొడవైన అర్బన్ టన్నెల్ కూడా ఈ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఉంది.