ఒక్కో ఓటర్‌కి కిలో మటన్ ఇచ్చినా ఓడించారు, ఇకపై ఎవరికీ టీ కూడా ఇవ్వను - గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
Nitin Gadkari: ఎన్నికల ప్రచారంలో తన పోస్టర్లు పెట్టనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nitin Gadkari:
పోస్టర్‌లు లేకుండానే ప్రచారం..
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటం వల్ల అన్ని పార్టీలూ ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంది. ప్రచార వ్యూహాలనూ మార్చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన...ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తన బ్యానర్‌లు, పోస్టర్‌లు కనిపించవని స్పష్టం చేశారు. అంతేకాదు. ప్రచారంలో పాల్గొన్న వాళ్లకి కనీసం టీ కూడా సర్వ్ చేయమని తేల్చి చెప్పారు. తనకు ఓటు వేయాలనిపించే వాళ్లు కచ్చితంగా వేస్తారని, లేదంటే మానుకుంటారని అన్నారు. మహారాష్ట్రలోని నేషనల్ హైవే ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన గడ్కరీ ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో ఇవి చాలా ఆసక్తిని రేకెత్తించాయి. తాను ఎప్పుడూ లంచం తీసుకోనని, ఎవరినీ తీసుకోనివ్వనని తేల్చి చెప్పారు.
"త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార విషయంలో నేనే క్లారిటీకి వచ్చాను. నా నియోజకవర్గంలో ఎక్కడా నా పోస్టర్లు, బ్యానర్‌లు పెట్టొద్దు. ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన కార్యకర్తలకు టీ కూడా ఇవ్వం. నాకు ఓటు వేయాలనిపిస్తే వాళ్లే వేస్తారు. లేదంటే వేయరు. నాకు లంచం తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇంకెవరైనా ఇచ్చినా ఊరుకోను. కానీ ఓ మాట మాత్రం కచ్చితంగా చెప్పగలను. నిజాయతీగా మీకు సేవ చేస్తాను"
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
మటన్ పంచారట..
ఈ ఏడాది జులైలోనూ నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఓ సారి తను ఓటర్లకు మటన్ ఇచ్చానని, అయినా ఓడిపోయానని చెప్పారు. ఎన్నికల్ని కేవలం ఓటర్ల నమ్మకంతోనే గెలవగలమని వెల్లడించారు. ఓటర్లు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారని, అందరు అభ్యర్థులు వాళ్లకు డబ్బులిస్తున్నా..నచ్చిన వాళ్లకే ఓటు వేస్తారని అన్నారు. 2014 నుంచి నాగ్‌పూర్ నియోజకవర్గాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు గడ్కరీ. 2019లోనూ ఆయనే విజయం సాధించారు.
"ఎన్నికలు అనగానే కొందరు భారీ ఎత్తున ప్రచారం చేస్తారు. పోస్టర్లు, బ్యానర్లు పెడతారు. ఏవో ఆశలు చూపిస్తారు. కానీ నాకు అలాంటి వాటిపై అసలు నమ్మకం లేదు. నేనూ గతంలో ఇలాంటివి చేశాను. ఓటర్లకు కిలో మటన్ చొప్పున పంచి పెట్టాను. అయినా ఓడిపోయాను. ఓటర్లు చాలా తెలివైన వాళ్లు. నచ్చిన వాళ్లకే ఓటు వేస్తారు"
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
గడ్కరీ గతంలో కాంగ్రెస్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేరాలంటూ ఆ పార్టీ నేత ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరిస్తూ సెటైర్లు వేశారు. గతంలో దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ నితిన్ గడ్కరీకి కాంగ్రెస్‌లోకి వెల్‌కమ్ చెప్పారు. దీని గురించి ప్రస్తావిస్తూ "కాంగ్రెస్ పార్టీలో చేరే బదులు బావిలో దూకుతానని చెప్పాను" అని సమాధానమిచ్చినట్టు వెల్లడించారు గడ్కరీ. మహారాష్ట్రలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. మోదీ సర్కార్‌కి 9 ఏళ్ల పూర్తైన సందర్భంగా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే బీజేపీ చరిత్రను ప్రస్తావించిన ఆయన అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీలో చేరిన తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ నేత ఆఫర్ గురించి చెప్పారు.