Nisar Satellite: శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నిసార్ , ఇకపై భూకంపం-సునామీ హెచ్చరిక ముందే తెలుస్తుంది!
Nisar Satellite: భూమిపై చిన్న మార్పులను గుర్తించే NISAR ఉపగ్రహాన్ని విజయవంతంగా శ్రీహరి కోట నుంచి ప్రయోగించారు. ఇకపై భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులను ముందే గుర్తించే ఛాన్స్ ఉంది.

Nisar Satellite: భారత్‌సహా ప్రపంచం మొత్తానికి జులై 30 ఒక చారిత్రాత్మక రోజుగా మారింది. NASA, ISRO సంయుక్తంగా నిర్మించిన NISAR (NASA-ISRO Synthetic Aperture Radar) ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించారు. ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 5:40 గంటలకు ప్రయోగించారు. ఇది భారతదేశ అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.
ఇస్రో అండ్ నాసా భాగస్వామ్యంతో నిర్మించిన NISAR ఉపగ్రహం
NISAR అంటే NASA-ISRO Synthetic Aperture Radar అని అర్థం. ఇది భారత్‌కు చెందిన ISRO, అమెరికాకు చెందిన NASA సంయుక్తంగా తయారు చేసిన ఒక ప్రత్యేక ఉపగ్రహం. దీని లక్ష్యం భూమి ఉపరితలాన్ని చాలా దగ్గరగా పరిశీలించడం, తద్వారా మన భూమిపై జరుగుతున్న సంక్లిష్ట ప్రక్రియలను అర్థం చేసుకోవడం. ఈ ఉపగ్రహం అడవులలో జరుగుతున్న మార్పులు, మంచు పలకలు విరిగిపోవడం, సముద్ర మట్టం పెరగడం, భూగర్భ జలాల కొరత, ప్రకృతి వైపరీత్యాలను నేరుగా పర్యవేక్షిస్తుంది.
#WATCH | Union MoS(Ind. Charge) Science & Technology, Jitendra Singh tweets, "Congratulations India! Successful launch of GSLV-F16 carrying the world’s first dual-band radar satellite NISAR…a game changer in precise management of disasters like cyclones, floods etc. Also, it’s… pic.twitter.com/spMuOpuViZ
— ANI (@ANI) July 30, 2025
భూమి ఉపరితలంలో జరిగే 1 సెంటీమీటర్ మార్పును కూడా గుర్తించగలదు
NISAR రాడార్ సాంకేతిక పరిజ్ఞానంపరంగా అంతరిక్షంలో ఒక ప్రత్యేకమైన పరికరం. ఇది చాలా కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఇది మొత్తం భూమి ఉపరితలాన్ని క్రమబద్ధంగా స్కాన్ చేస్తుంది. కేవలం 1 సెంటీమీటర్ల మార్పులను కూడా గుర్తిస్తుంది. అంటే, ఈ ఉపగ్రహం మనకు ప్రకృతి వైపరీత్యాల గురించి ముందే సూచనలు ఇవ్వగలదు. అలాంటి హెచ్చరికలు వచ్చిన తర్వాత సకాలంలో హెచ్చరికలు జారీ చేయడానికి వీలు కలుగుతుంది.





















