Next President of India: రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు- భాజపా ప్లాన్ ఇదేనా?
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడ్ని తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా ఎంపిక చేయనుందనే వార్తల్లో నిజమెంత?
భారత తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడ్ని ఎంపిక చేయాలని భాజపా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సన్నిహిత వర్గాలు స్పందించాయి. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య పదవీకాలం 2022తో ముగియనుంది. దీంతో ఆయన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని భాజపా భావిస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలు అవాస్తవమని సమాచారం.
ప్రతిపక్ష అభ్యర్థిగా
2022లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షం తరఫున అభ్యర్థిగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ లేదా కేసీఆర్‌ను బరిలోకి దింపాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపితే కాంగ్రెస్ కూడా మద్దతిస్తుందనేది ఆయా పార్టీల వాదన. దీనిపై ఇటీవల జరిగిన ఠాక్రే- కేసీఆర్ భేటీలో కూడా చర్చ జరిగిందని సమాచారం.
కానీ ఏబీపీ న్యూస్ సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ మినహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ థర్డ్ ప్రంట్ ఏర్పాటు చేసి.. రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను లేదా కేసీఆర్‌ను ప్రకటించాలని చూస్తున్నాయి.
కాంగ్రెస్ మద్దతు
నితీశ్ కుమార్ లేదా కేసీఆర్ లాంటి బలమైన నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ కూడా మద్దతిచ్చే అవకాశం ఉందని పార్టీలు భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిసి ఈ వ్యూహం రచించినట్లు సమాచారం. ఇతర ప్రతిపక్ష పార్టీలను ఈ నిర్ణయంపై ఏకతాటిపైకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్.. పలు రాష్ట్రాల నేతలను కలుస్తున్నారని తెలుస్తోంది.
నితీశ్ వస్తారా?
ప్రస్తుతం నితీశ్ కుమార్ పార్టీ జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) ఎన్‌డీఏలో ఉంది. కానీ ఈ మధ్య భాజపా, జేడీయూ మధ్య విభేదాలు వస్తున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. బిహార్‌లో కులగణన చేయాలని నితీశ్ కుమార్ పలుసార్లు కోరినప్పటికీ భాజపా ససేమిరా అని చెప్పింది. ఈ విషయంలో నితీశ్‌కు ప్రతిపక్ష ఆర్‌జేడీ కూడా మద్దతిస్తోంది. దీంతో నితీశ్ మళ్లీ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల ప్రశాంత్ కిశోర్.. నితీశ్ కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ ప్లాన్ గురించి నితీశ్‌తో కిశోర్ చర్చించినట్లు సమాచారం.
Also Read: Rajya Sabha Elections 2022: 6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఒకే రోజు పోలింగ్
Also Read: Tamil Nadu News : రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు, లెక్కపెట్టడానికే 10 గంటలు పట్టింది!