Tripura CM: త్రిపుర సీఎంపై హత్యాయత్నం... కారుతో ఢీకొట్టేందుకు యత్నించిన దుండగులు... తృటిలో తప్పిన ప్రమాదం
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పై హత్యా యత్నం జరిగింది. ఆయన ఈవెనింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. అప్రమత్తంగా ఉన్న ఆయన వెంటనే పక్కకు తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ పైకి ఓ కారు అతివేగంగా దూసుకువచ్చింది. ఆయన ఈవెనింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆయన అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయని సమాచారం. ఈ నెల 5వ తేదీ సాయంత్రం సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తన అధికారిక నివాసం వద్ద నడుస్తుండగా భద్రతా సిబ్బందిని దాటి ఓ వాహనం వేగంగా వచ్చిందని, అది గమనించిన సీఎం వెంటనే ఆయన పక్కకు దూకేశారని పోలీసులు తెలిపారు. ఆ కారును సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా వేగంగా దూసుకొచ్చిందని చెప్పారు. కారును ఆపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు తర్వాతి రోజు రాత్రి కెర్చ్ నుమానీ అనే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన అరెస్టు చేసిన ముగ్గురిని స్థానిక కోర్టులో హాజరు పరచగా, వారికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ ముగ్గురు నిందితులను శుభం సాహో, అమన్ సాహో, గైరిక్ ఘోష్ గా పోలీసులు గుర్తించారు. సీఎంపై హత్యాయత్నం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ అభియోగాల కింద వారిపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. సీఎం భద్రతా సిబ్బంది విధులకు ఆటంకం కల్గించారన్న కేసును కూడా యువకులపై నమోదైంది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న త్రిపుర ముఖ్యమంత్రికి గతంలోనూ బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. మయన్మార్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు సీఎం బిప్లవ్ దేవ్ పటిష్ట చర్యలు చేపట్టారు. వీటిపై ఉత్తర్వులు కూడా జారీచేశారు. ప్రస్తుతం త్రిపురలో రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిద్యుత్ సూత్రధార్ వివరించారు. ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ ను కారుతో ఢీకొట్టి హత్యయాత్నానికి ప్రయత్నించింది ముగ్గురు యువకులని, వారి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందని చెప్పారు. నిందితులను రెండు రోజుల పోలీసుల కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరామన్నారు. కానీ కోర్టు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిందన్నారు. ముఖ్యమంత్రి భద్రతా వలయంలోకి కారుతో దూసుకురావడంపై వారి ఉద్దేశం ఏంటనే విషయం దర్యాప్తులో తెలనుందని చెప్పారు.