Mumbai Local Train Blasts: 2006 ముంబై లోకల్ ట్రైన్ పేలుళ్ల కేసు- 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు
Mumbai Blasts Case | 2006 లో ముంబైలోని లోకల్ ట్రైన్ పేలుళ్ల కేసులో శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిగువ కోర్టు తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

Mumbai Local Train Blasts Case | ముంబై: 2006లో ముంబై లోకల్ ట్రైన్ పేలుడు కేసులో బాంబే హైకోర్టు (Bombay High Court) సోమవారం నాడు సంచలన తీర్పునిచ్చింది. హైకోర్టు 12 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటించి, వారిని విడుదలకు ఆదేశించింది. జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ ఎస్.జి. చాండక్ లతో కూడిన ధర్మాసనం 12 మంది నిందితులకు దిగువ కోర్టు వేసిన శిక్షను రద్దు చేసింది. వారిపై నమోదైన అభియోగాలను నిరూపించడంతో విఫలమైన కారణంగా వారిని నిర్దోషులుగా ప్రకటించారు. వీరిలో 5 మందికి ఉరిశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, తాజాగా వారందరినీ నిర్దోషులుగా బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.
ముంబైలో 2006 జూలై 11న లోకల్ ట్రైన్‌లో జరిగిన పేలుళ్లలో 189 మంది మరణించారు. ఈ కేసులో సెషన్స్ కోర్టు 2015లో 13 మంది నిందితుల్లో 12 మందిని దోషులుగా తేల్చింది. వారిలో ఒక నిందితుడు అప్పటికే చనిపోయాడు. ఈ కేసు విచారణ జనవరి నెలలో ముగిసింది, కానీ ధర్మాసం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నిందితులందరూ నాసిక్, ఎరవాడ, నాగ్‌పూర్ జైళ్లలో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ వేదికగా కోర్టు వారిని విచారించింది.
11 నిమిషాల్లో 7 పేలుళ్లు, 189 మంది మృతి (2006 Mumbai Blasts)
దాదాపు 2 దశాబ్దాల కిందట ముంబైలో జరిగిన పేలుళ్లలో 189 మంది మరణించగా, 827 మంది తీవ్రంగా గాయపడ్డారు. జూలై 11న కేవలం 11 నిమిషాల్లో 7 పేలుళ్లు జరిగాయి. ఈ కేసును సెషన్స్ కోర్టు విచారించి వారిని దోషులుగా తీర్పు ఇచ్చింది. దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు స్పెషల్ బెంచ్ విచారించగా.. నిందితులు తప్పు చేసినట్లు తేలకపోవడంతో వారిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది.
మొత్తం 12 మంది నిందితులలో ఐదుగురు నిందితులు మహ్మద్ ఫైసల్ షేక్, ఆసిఫ్ ఖాన్, ఎహతేషమ్ సిద్ధిఖీ, నవేద్ హుస్సేన్ ఖాన్, కమల్ అన్సారిలకు ఉరిశిక్ష విధించింది కోర్టు. వీరిలో కమల్ అన్సారి 2022లో కరోనా వైరస్ బారిన పడి జైలులో మరణించాడు.
కోర్టు తీర్పు వెలువరించే సమయంలో కీలక వ్యాఖ్యలు
PTI నివేదిక ప్రకారం, బాంబే హైకోర్టు ఇలా వ్యాఖ్యానించింది.. ''మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిందితులపై నేరం రుజువు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిందితులే ఈ నేరం చేశారని నమ్మడం కష్టం, వారు నేరానికి బాధ్యులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కనుక వారిని దోషులుగా నిర్ధారించడం సరికాదు. ఈ కేసులో శిక్ష ఎదుర్కొంటున్న 12 మంది నిర్దోషులే’’
ఐదుగురికి మరణశిక్షను, మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదును సమర్థించలేమని బాంబే హైకోర్టు ధర్మాసనం తెలిపింది. వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. నిందితులు మరే ఇతర కేసుల్లోనూ వాంటెడ్ కాకపోతే, వారిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు పేర్కొంది.






















