Meghalaya HC: మైనర్‌పై లైంగిక చర్య - అలా చేస్తే అత్యాచారమా, కాదా? మేఘాలయ హైకోర్టు కీలక తీర్పు
Meghalaya High Court: మైనర్ బాలికను అత్యాచారం చేసినందుకు వ్యక్తిని దోషిగా తేల్చుతూ 2018లో కింది స్థాయి కోర్టు తీర్పు వెలువరించింది. అతనికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా వేసింది.
మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసులో మేఘాలయ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అతనికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. అత్యాచారం సమయంలో బాధితురాలు లో దుస్తులు ధరించి ఉన్నందున లైంగిక చర్య జరగలేదని నిందితుడు పేర్కొనగా.. ఆ వాదనను మేఘాలయ హైకోర్టు తోసి పుచ్చింది.
ఇది 2006 ఏడాదిలో జరిగిన కేసు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లుగా మెడికల్ టెస్టు ద్వారా నిరూపితం అయింది. ఆ మైనర్ బాలికపై లైంగిక చర్యకు పాల్పడ్డ అనుమానితుడు చీర్‌ఫుల్‌సన్ స్నైటాంగ్‌ను దోషిగా తేల్చుతూ 2018లో కింది స్థాయి కోర్టు తీర్పు వెలువరించింది. అతనికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా కూడా విధించింది.
అయితే, ఆ తర్వాత దోషిగా తేలిన స్నైటాంగ్ తర్వాత తన వాదనను మార్చాడు. తన మాటలను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లాడు. కింది స్థాయి తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశాడు. మైనర్ బాలికపై లైంగిక దాడి సమయంలో అతను తన పురుషాంగాన్ని బాలిక లో దుస్తులపై రుద్దాడని, అంతేకానీ ఎలాంటి ప్రవేశం జరగలేదని అతని తరపు న్యాయవాది వాదించారు.
కేసు విచారణ దశలో ఉండగా బాధిత యువతిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సమయంలో.. నిందితుడు తన లోదుస్తులను ఆ సమయంలో తొలగించలేదని చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ వాన్లూరా డియెంగ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ మాట్లాడుతూ.. “బాధితురాలు క్రాస్ ఎగ్జామినేషన్‌లో చెప్పిన సాక్ష్యం పరిగణనలో తీసుకుంటే, ఎలాంటి అంగ ప్రవేశం జరగలేదు. ఆ సమయంలో బాధితురాలు లో దుస్తులను ధరించి ఉంది. నిందితుడు ఆమె లో దుస్తులపై నుంచి అతని అవయవాన్ని రుద్దాడని అంగీకరించింది. IPCలోని సెక్షన్ 375 (ఇది అత్యాచారాన్ని నేరంగా నిర్వచిస్తుంది) ప్రకారం.. అత్యాచారం సమయంలో ప్రవేశం జరగనవసరం లేదు” అని సోమవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
గతంలో సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ..
ఈ తీర్పుపై మేఘాలయ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (SCPCR) మాజీ చైర్‌పర్సన్, ప్రముఖ న్యాయవాది మీనా ఖార్కోంగోర్ స్పందిస్తూ, హైకోర్టు తీర్పు సక్రమంగానే ఉందని, అలాంటి ఉద్దేశాలతో నేరస్థులను మరింత అరికట్టగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. 2012లో సుప్రీం కోర్టు రేప్ కేసుల్లో మార్గనిర్దేశక సూత్రాలను పునరుద్ఘాటించింది. అత్యాచారం నేరాన్ని నిర్ధారించడానికి చొరబాటు అవసరం లేదని అందులో పేర్కొంది. ‘‘ప్రవేశం అనేది అత్యాచారం నేరం అని రుజువు చేస్తుంది. కానీ ప్రవేశం జరగకపోతే అత్యాచారం జరగలేదని దీని అర్థం కాదు’’ అని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.