Nishikanth Dubey On Rahul Gandhi: నేనంటే రాహుల్ గాంధీకి ప్రేమ- బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకి తనపై ప్రేమ ఎక్కువగా ఉన్నందునే, గొడ్డా నియోజకవర్గంలో భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించ లేదన్నారు.
BJP Mp Nishikanth Dubey Comments On Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీజేపీ ఎంపీ (BJP MP) నిషికాంత్ దూబే (Nishikant Dubey)సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకి తనపై ప్రేమ ఎక్కువగా ఉన్నందునే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గొడ్డా (Godda) నియోజకవర్గంలో భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించ లేదన్నారు. గొడ్డాతో పాటు దేవ్‌ఘర్ జిల్లాలోనూ రాహుల్ గాంధీ యాత్ర చేయడం లేదని, ఎన్నికల సమయంలో సెక్యులర్‌గా కనిపించాలని అనుకుంటున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవఘర్ జిల్లాలో న్యాయ్ యాత్ర చేయవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారేమో అని నిషికాంత్ దూబే వ్యాఖ్యానించారు.
15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా యాత్ర
మణిపుర్ నుంచి ముంబయి వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టారు రాహుల్ గాంధీ. న్యాయ్ యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభం అవుతుంది. మార్చి 30న ముంబైలో ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా యాత్ర సాగనుంది. దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగనుంది. తొలి దశలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. అయితే న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో, అక్కడక్కడా పాదయాత్ర చేపట్టనున్నారు. భారత్ జోడో యాత్రలో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల నడించారు.
ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారని దూబే ఆరోపించారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహుబా డబ్బులు తీసుకున్నారని అన్నారు. పారాదీప్, ధమ్రా పోర్ట్ నుంచి చమురు, గ్యాస్ సరఫరా, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న ఉక్కు ధరలు, ఆదాయపు పన్ను శాఖ అధికారాలపై మహువా ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడం, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత మహువా మోయిత్రాపై స్పీకర్ ఓం బిర్లా వేటు వేశారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
ఫ్లైట్ టేకాఫ్ కోసం ఏటీసీపై దూబే ఒత్తిడి
నిషికాంత్ దూబే ఝార్ఖండ్ లోని గొడ్డా పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు. గత ఏడాది ఝార్ఖండ్‌లోని దేవఘర్ విమానాశ్రయం నుంచి తమ చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేయడంతో కేసు నమోదైంది. ఆగస్టు 31న లోక్‌సభ సభ్యుడు నిషికాంత్ దూబే, ఆయన కుమారుడు కనిష్క్ కాంత్ దూబే, మహికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేష్ పాథక్, దేవతా పాండే, పింటూ తివారీలు భారీ భద్రత ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లోకి ప్రవేశించారు. దేవఘర్ విమానాశ్రయం నుంచి తమ చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కావడానికి క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విమానాశ్రయ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు మేరకు బీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు.