హైకమాండ్ చెప్తే తప్ప రాజీనామా చేసే ప్రసక్తే లేదు, ఒకే ఒక అత్యాచార కేసు నమోదైంది - మణిపూర్ సీఎం
Manipur Violence: కేంద్రం చెప్పేంత వరకూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ తేల్చి చెప్పారు.
Manipur Violence:
రాజీనామా చేయను..
మణిపూర్ హింసాంకాండ మొత్తం దేశాన్ని ఉడికిస్తోంది. అటు పార్లమెంట్‌లోనూ దీనిపై పెద్ద రగడే జరుగుతోంది. ఈ హింసపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీనిపై పలువురు విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయటే ఆందోళనలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా బీజేపీ వైఫల్యమే అని తేల్చి చెబుతున్నారు. ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన బైరెన్ సింగ్ మరోసారి ఇదే విషయం వెల్లడించారు. రిజైన్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప రాజీనామా చేయనని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే ప్రసక్తే లేదు. కానీ కేంద్రం ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే తప్ప రాజీనామా చేయను. ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీలో ఉన్నాను. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని పాటించడం నా బాధ్యత. ప్రస్తుతానికి నా ముందున్న ఒకే ఒక లక్ష్యం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకురావడం. వీలైనంత త్వరగా పరిస్థితులు అదుపులోకి రావాలి. రాజీనామా చేయమని ఇంత వరకూ మా పార్టీ నాకు చెప్పలేదు."
- బైరెన్ సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి
3 నెలల హింసాకాండ..
దాదాపు మూడు నెలలుగా మణిపూర్‌లో శాంతి భద్రతలు అదుపులోకి రాలేదు. కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ బైరెన్ సింగ్ రాజీనామా చేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఆయన స్పష్టతనిచ్చారు. ఇదే సమయంలో మరి కొన్ని కీలక విషయాలూ ప్రస్తావించారు. అక్రమ వలసదారులు, డ్రగ్ స్మగ్లర్స్ కారణంగానే రాష్ట్రంలో ఇలా అలజడి రేగిందన్న ఆరోపణల్ని ఖండించారు. అక్రమ వలసల్ని పూర్తిస్థాయిలో అడ్డుకున్నామని స్పష్టం చేశారు.
"వీలైనంత వరకూ అక్రమ వలసల్ని నియంత్రించేందుకు ప్రయత్నించాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశాం. కుకీలు, మైతేయిలు కలిపి మణిపూర్‌లో 34 తెగలున్నాయి. ఇక్కడ నివసించే వాళ్లందరూ కలిసే ఉంటున్నారు. కొంత మంది మాత్రం ర్యాలీల పేరుతో రాష్ట్రాన్ని తగలబెడుతున్నారు. అక్రమ వలసదారుల విషయంలో మేం అప్రమత్తంగానే ఉన్నాం. ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాం. బయటి నుంచి వచ్చిన వాళ్లతోనే ఈ సమస్య. ఏదేమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వేగంగా పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి"
- బైరెన్ సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి
ఇద్దరు మహిళల మృతి..
ఇప్పటి వరకూ ఈ హింసకు కారణమైన వాళ్లపై 6,068 FIRలు నమోదు చేసినట్టు వెల్లడించారు బైరెన్ సింగ్. ఒకే ఒక్క అత్యాచార ఘటన నమోదైందని తెలిపారు. గత వారం ఓ కార్ సర్వీస్ సెంటర్ వద్ద ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించాయి. దీనిపై మాట్లాడిన బైరెన్ సింగ్...వాళ్లను చంపేశారని, వారిపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. అటు ప్రతిపక్షాలు మాత్రం బైరెన్ సింగ్ వైఫల్యం వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయన్న విమర్శల్ని ఆపడం లేదు.
Also Read: No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం! మెజార్టీ లేకున్నా సై