(Source: ECI/ABP News/ABP Majha)
Manipur Violence: మణిపూర్‌లో మరో ఘోరం, స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం
Manipur Violence: మణిపూర్ లో మరో దారుణం వెలుగు చూసింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ మూక సజీవంగా దహనం చేసింది.
Manipur Violence: మణిపూర్ లో అరాచకాలు ఆగడం లేదు. రోజుకో దారుణ ఘటన వెలుగుచూస్తోంది. ఈ ఈశాన్య రాష్ట్రం ఇప్పుడు హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతోంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను మరో వర్గం వారు నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సమయంలోనే మరో అరాచక ఘటన వెలుగుచూసింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్ చురాచాంద్ సింగ్ భార్య సోరోకైబామ్ ఇబెటోంబి అనే 80 ఏళ్ల వృద్ధురాలిని కొందరు సజీవంగా దహనం చేశారు. ఆయుధాలతో వచ్చిన ఆ మూక.. వృద్ధురాలిని ఇంట్లో వేసి బయటి నుంచి గడియ పెట్టి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన మే 28వ తేదీన తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు గ్రామంలో భారీగా హింస జరిగింది. కాల్పులు చోటు చేసుకున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. చురాచాంద్ సింగ్.. గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి సత్కారం అందుకున్నారు.
80 ఏళ్ల ఇబెటోంబి తన ఇంట్లో ఉన్న సమయంలో ఆయుధాలతో గ్రామంపైకి వచ్చిన కొందరు దుండగులు ఆ వృద్ధురాలి ఇంటికి బయటి నుంచి గడియ పెట్టారు. అనంతరం ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఆమెను రక్షించేందుకు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొనే సరికే.. ఆ ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్ కాంత వెల్లడించారు. కుటుంబ సభ్యులపైనా ఆ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కొన్ని బుల్లెట్లు తమ కుటుంబ సభ్యుల కాళ్లు, చేతుల్లోంచి దూసుకుపోయాయని చెప్పారు. కాల్పులు జరుగుతున్న సమయంలో వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ వృద్ధురాలు అందరికీ చెప్పిందని, అక్కడి నుంచి పారిపోవాలని కోరిందని.. కానీ ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయిందని ప్రేమ్ కాంత ఆవేదన వ్యక్తం చేశాడు.
కుకీ- మైటీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఈ గ్రామం కూడా ఒకటి. ఇది మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతకు ముందు ఎంతో సుందరంగా, ప్రకృతితో చాలా అందంగా ఉండే ఈ గ్రామం ఇప్పుడు శిథిలాలతో అందాన్ని కోల్పోయింది. చాలా ఇళ్ల గోడలపై తూటాలు కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసిన కాలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లే దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామ ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పుడు ఎవరూ నివసించడం లేదు. ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా మారిపోయింది.
మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారం
మణిపూర్ లో ఇరు వర్గాల మధ్య పోరులో అల్లరి మూకలు ఓ గ్రామంపై ఎగబడ్డాయి. ఈ క్రమంలో తప్పించుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలపై ఆందోళనకారులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుల్లో 50 ఏళ్ల వ్యక్తి, అతడి 19 ఏళ్ల కుమారుడు , 21 ఏళ్ల కుమార్తె, 52, 42 ఏళ్ల ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిపై అల్లరి మూక దాడి చేయగా.. వారు పరుగన వెళ్లి సమీప పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
దాదాపు 800 నుంచి 1000 మంది ఉన్న భారీ గుంపు పోలీసుల నుంచి వారిని లాక్కెళ్లారు. ఈ క్రమంలో 21 ఏళ్ల యువతిని గుంపులోని వారు లాక్కెళ్తుండగా.. 19 ఏళ్ల యువకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. గుంపులో ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు అతడిపై దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. తర్వాత ఆ యువతిని లాక్కెళ్లి బట్టలూడదీసి ఊరేగించారు. తర్వాత పొలంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మే 18వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జులై 19వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. గిరిజన మహిళలపై మరో వర్గం వారు ప్రవర్తించిన కీచక తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అత్యంత ఘోరమైన ఘటనకు సంబంధించి తౌబల్ జిల్లాకు చెందిన హెరాదాస్ అనే వ్యక్తినిపోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.