Maharashtra Crime News: అంత్యక్రియలు జరిగిన వారం రోజులకు మృతుడి నుంచి వీడియో కాల్ - దర్యాప్తు చేస్తున్న పోలీసులు!
Maharashtra Crime News: అంతా అతడు చనిపోయాడనుకున్నారు. ఈ క్రమంలోనే మృతదేహం లభించగా తమ కుటుంబ సభ్యుడే అనుకొని ఖననం చేయగా... వారం రోజులకే అతడు తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు.
Maharashtra Crime News: 60 ఏళ్ల వృద్ధుడు. గత రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. దీంతో చాలా వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇదే క్రమంలోనే పోలీసులకు ఓ మృతదేహం లభించగా... అది అతడి కావచ్చేమోనని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లి చూసిన వారు అది తమ కుటుంబ సభ్యుడిదేనని చెప్పగా.. మృతదేహాన్ని వారికి అప్పగించారు. వీరు అతడికి అంత్యక్రియలు కూడా చేశారు. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. అది చూసిన సదరు వ్యక్తి షాక్ తిన్నాడు.
అసలేం జరిగిందంటే..?
మహారాష్ట్రలోని పాల్ ఘర్ కు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు రఫిక్ షేక్ ఆటో రిక్షా నడిపేవాడు. ఆయన గత రెండు నెలల క్రితం కనిపించకుండా పోయాడు. అదే సమయంలో బోయసర్, పాల్ గఢ్ స్టేషన్ మధ్య ఓ వ్యక్తి హత్య జరిగింది. పోలీసులకు అనుమానం వచ్చి కేరళలో ఉంటున్న షేక్ భార్యకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన ఆమె.. చనిపోయింది తన భర్తేనని నిర్ధారించింది. దీంతో మృతదేహాన్ని ఆ ఫ్యామిలీకి పోలీసులు అప్పగించారు. ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు చేశారు. ఖననం చేసి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు.
అంత్యక్రియలు జరిగిన వారం రోజులకే షాక్ ఇచ్చే ఘటన జరిగింది. అదే గ్రామంలో ఉంటున్న రఫిక్ షేక్ స్నేహితుడికి ఓ వీడియో కాల్ చేశాడు. ఒక్కసారిగా ఆ వీడియో కాల్ చూసిన సదరు వ్యక్తి వణికిపోయాడు. ఆ వీడియో కాల్‌లో అంతకు ముందు వారం రోజుల క్రితం చనిపోయిన రఫీక్‌షేక్‌ను చూసిన స్నేహితుడు ముందుగా తీవ్రంగా భయపడిపోయాడు. షాక్ తో ఆదివారం రోజు పోలీసులను ఆశ్రయించాడు. చనిపోయిన వ్యక్తి, షేక్ ఒకటి కాదని వారు నిర్ధారించుకున్నారు.
గతేడాది ఏపీలో కూడా ఇలాంటి ఘటనే..
మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో పాలేటి వెంకయ్య, రమాదేవి దంపతులు. రమాదేవి గ్రామ సర్పంచ్. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు పేరు సుమంత్, రెండో కొడుకు పేరు సతీష్. ఇటీవల రెండో కొడుకు సతీష్ కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అతనికోసం కుటుంబ సభ్యులు గాలించారు. తెలిసినవారికి ఫోన్ చేశారు, స్నేహితుల్ని ఆరా తీశారు. కానీ ఫలితం లేదు. మూడు రోజులుగా జాడ తెలియలేదు. అయితే వీరు వెదికే క్రమంలో వెంకటాచలం వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో ఓ శవం కనిపించింది. ఆ శవం పోలికలు సతీష్ లానే ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతా అయిపోయాక చిన్న కర్మ కూడా నిర్వహించారు. సతీష్ ఫొటోకి దండవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
సీన్ కట్ చేస్తే..?
శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అక్కడ సీన్ కట్ చేస్తే.. ఆదివారం సతీష్ ఇంటికి తిరిగొచ్చాడు. పూడ్చేసిన శవం ఎలా లేచొచ్చిందంటూ తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఊరిలో సతీష్ ని చూసినవారంతా దెయ్యం అంటూ పారిపోవడం విశేషం. కుటుంబ సభ్యులు కూడా సతీష్ ని చూసి దెయ్యం అనుకున్నారు. పరుగులు తీశారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది.
సతీష్ ఎలా తిరిగొచ్చాడు..?
ఆదివారం సతీష్.. ఇంటికి తిరిగొచ్చాడు. అసలిన్ని రోజులు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనే విషయం తానే స్వయంగా చెప్పుకొచ్చాడు. అలిగి వెళ్లిన తాను స్నేహితుల దగ్గర ఉన్నానని చెప్పాడు సతీష్. ఫోన్ కూడా స్విచాఫ్ చేసి నాలుగు రోజులుగా రూమ్ లోనే ఉండిపోయాయని అన్నాడు. తీరా ఊరిలోకి వస్తే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని తెలుసుకుని పరుగు పరుగున ఇంటికొచ్చానని చెప్పాడు. సతీష్ ని చూసి మొదట భయపడిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చనిపోయాడనుకున్న కొడుకు బతికి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.