Smith 36Th 100: ద్రవిడ్, రూట్ ల సరసన స్మిత్, లంకపై సెంచరీ, రెండో టెస్టులో పట్టు బిగించిన ఆసీస్
రెండో టెస్టులో సెంచరీ చేసి ఈ ఫార్మాట్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్ గా సంయుక్తంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ రాహుల్ ద్రవిడ్, ఇంగ్లాండ్ కు చెందిన జో రూట్ తో సమంగా నిలిచాడు.

Smith Records Alert: రన్ మెషీన్, ఆస్ట్రేలియా స్టాండిన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గాలేలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసి ఈ ఫార్మాట్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్ గా సంయుక్తంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ రాహుల్ ద్రవిడ్, ఇంగ్లాండ్ కు చెందిన జో రూట్ తో సమంగా నిలిచాడు. వారిద్దరూ కూడా 36 సెంచరీలు చేశారు. ఈ సిరీస్ లో స్మిత్ కిది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. అలాగే ఈ టెస్టులో తాజాగా ఆస్ట్రేలియా తరపున అత్యధిక క్యాచులు (197) పట్టిన ఫీల్డర్ గా రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను స్మిత్ దాటేశాడు. గత మ్యాచ్ లో పది వేల పరుగుల మైలు రాయిని అధిగమించిన స్మిత్.. ఈ మ్యాచ్ లో మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
It's Steve Smith Test century number 36!
— 7Cricket (@7Cricket) February 7, 2025
His fourth in the last five Tests too 🔥#SLvAUS pic.twitter.com/vxfS1ShMFK
ఆదుకున్న స్మిత్..
నిజానికి స్మిత్ బ్యాటింగ్ కు వచ్చేటప్పటికి ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ వికెట్లను కోల్పోయి 37/2తో ఆసీస్ కష్టాల్లో పడింది. తను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీ గండం నుంచి బయట పడ్డాడు. బంతి ప్యాడ్ కు తాకగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. లంక ఆటగాళ్లు రివ్యూ తీసుకోగా వికెట్లను మిస్సయినట్లు తేలింది. ఆ తర్వాత కుదురుకోడానికి సమయం తీసుకున్న స్మిత్.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. మెరుగ్గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, అడపదడపా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 98 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియన్ గా రికీ పాంటింగ్ రికార్డు (1889 పరుగులు)ను స్మిత్ అధిగమించాడు.
36వ సెంచరీ..
సెంచరీ తర్వాత జోరు పెంచిన స్మిత్.. బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మైదానం నలుమూలలా చూడచక్కని షాట్లు కొడుతూ టెస్టులో 36వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆట ముగిసేసరికి 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ కూడా అజేయ సెంచరీ చేశాడు. టెస్టుల్లో తనకది రెండో సెంచరీ కావడం విశేషం. ఈక్రమంలో అబేధ్యమైన మూడో వికెట్ కు 239 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో లంక 257 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్, మథ్యూ కునెమన్, నాథన్ లైయన్ కు మూడేసి వికెట్లు దక్కాయి. రెండో రోజు ఆటముగిసేసరికి మూడు వికెట్లకు 330 పరుగులు చేసిన ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నిషాన్ పీరిస్ కు రెండు, ప్రభాత్ జయసూర్యకు ఒక వికెట్ దక్కింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

