(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra News: మహారాష్ట్రలో పెను విషాదం! 11 మంది మృతి - 600 మందికి పైగా గుండె సమస్యలు!
విపరీతమైన ఎండ కారణంగా ఓపెన్ గ్రౌండ్ లో ఉన్న జనం డీహైడ్రేషన్ కు గురై ఏకంగా 11 మంది చనిపోయారు.
Maharashtra Bhushan Award ceremony Tragedy: మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవంలో తీవ్రమైన విషాదం నెలకొంది. నవీ ముంబయిలోని ఓ ఓపెన్ గ్రౌండ్‌లో ఆదివారం (ఏప్రిల్ 17) ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. విపరీతమైన ఎండ కారణంగా ఓపెన్ గ్రౌండ్ లో ఉన్న జనం డీహైడ్రేషన్ కు గురై ఏకంగా 11 మంది చనిపోయారు. మొత్తం 600 మంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన వారిలో 8 మంది మహిళలు ఉన్నారు. ఎంతో మంది ఆస్పత్రిపాలు కాగా, వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయని, మరికొంత మంది కార్డియాక్ సమస్యలు తలెత్తాయని స్థానిక వార్తా పత్రికలు రాశాయి.
ఓపెన్ గ్రౌండ్‌లో వేలాది మంది జనం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎండలోనే కూర్చొని ఉన్నారు. నవీ ముంబయిలోని ఖార్ఘర్‌లో ఇంటర్నేషనల్ కార్పొరేట్ గ్రౌండ్ పార్క్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ అలియాస్ అప్పాసాహెబ్ ధర్మాధికారికి వేలాది మంది మద్దతుదారులు ఈ కార్యక్రమానికి చేరుకున్నారు. శనివారం నుంచే కార్యక్రమంలో పాల్గొనేందుకు జనం రావడం ప్రారంభించారు. ఆదివారం జరిగిన సన్మాన కార్యక్రమానికి లక్షలాది మంది మద్దతుదారులు తరలివచ్చారు.
మహారాష్ట్ర భూషణ్ సమ్మాన్ వేడుకలో ఎండ వేడిమి నుంచి రక్షించేందుకు ఎలాంటి షెడ్ ఏర్పాటు చేయలేదు. ప్రజలు డీహైడ్రేషన్ వల్ల అస్వస్థతకు గురైన వారిని వెంటనే వేదికకు సమీపంలో ఉన్న 30 మెడికల్ బూత్‌లకు తరలించారు. 13 మంది రోగులను ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు, వారి పరిస్థితి విషమంగా ఉంది.
వేదికపై కేంద్ర హోంమంత్రి కూడా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర భూషణ్ అవార్డును ధర్మాధికారికి అందజేశారు. డాక్టర్ నారాయణ్‌ను అప్పా సాహెబ్ ధర్మాధికారి అని కూడా పిలుస్తారు. భారీ ఎత్తున తరలివచ్చిన సభను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ సామాజిక రంగంలో దత్తాత్రేయ నారాయణ్ చేస్తున్న కృషిని కొనియాడారు.
విపక్షాల విమర్శలు
నాగ్‌పూర్‌లో జరిగిన మహావికాస్ అఘాడి సమావేశం తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే, అజిత్ పవార్ మరియు ఆదిత్య ఠాక్రే MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను కలిశారు. ముగ్గురు నేతలు రోగుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రజల ఆరోగ్యంపై పాలకులు సమాచారం తీసుకుంటున్నారని విపక్ష నేతలు అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా విమర్శించారు.
ఏబీపీ మాఝాలో ప్రచురించిన వార్త ప్రకారం, అమిత్ షా ముందుగానే బయలుదేరాలని భావించినందున ఆ కార్యక్రమాన్ని మధ్యాహ్నం నిర్వహించారా అని థాకరే ప్రశ్నించారు. మృతుల సంఖ్యను దాచిపెడుతున్నారని ప్రతిపక్ష నేత అజిత్ పవార్ ఆరోపించారు. వేసవి రోజుల్లో మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించడం నిర్వాహకుల తప్పు అని ఆరోపించారు. రోగుల సంఖ్య, మరణించిన వారి సంఖ్యను కూడా వెల్లడించలేదని అజిత్ పవార్ అసహనం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.