LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు
LPG Gas Cylinder Price Hike:దేశవ్యాప్తంగా గ్యాస ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల సిలిండర్లపై 50 రూపాయల వరకు భారం వేసింది.

LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది కేంద్రం. ఎల్పీజీ సిలిండర్‌పై 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ గ్యాస్ వినియోగదారులకు, ఉజ్వల సిలిండర్ పొంది ఉన్న వినియోగదారులకు ఇద్దరికి కూడా కేంద్రం షాక్ ఇచ్చింది. వాటి ధరలను కూడా రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ఉజ్వల వినియోగదారుల సిలిండర్ ధర రూ.500 నుంచి రూ.550కి పెరగనుంది. మిగతా సిలిండర్ ధఱలు రూ.803 నుంచి రూ.853కి పెరగనుంది. ఈ కొత్తధరలు అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
ఇవాళ కేంద్రం రెండు షాక్‌లు ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై 2 రూపాయలు ఎక్సైజ్ పన్ను వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ భారం వినియోగదారులపై పడబోదని చెప్పింది. కాస్త ఊపిరి తీసుకున్న టైంలోనే గ్యాస్ దరలు పెంచుతున్నట్టు షాక్ ఇచ్చింది.
ప్రభుత్వం ఏం చెప్పింది?
ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం..." ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం అంటే 8 ఏప్రిల్ 2025 నుంచి రూ.50 పెరగనుంది. ఈ పెరుగుదల అన్ని వినియోగదారులకు అంటే ఉజ్వల యోజన, ఉజ్వల కాని వారికి వర్తిస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఈ పథకం ప్రయోజనం గ్రామీణ ప్రాంతాల పేద మహిళలకు అందిస్తున్నారు. ఇప్పుడు కొత్త ధరల ప్రకారం ఉజ్వల యోజన, ఇతర వినియోగదారులు ఇద్దరు కూడా ఈ భారం భరించాల్సి ఉంటుంది.
హర్దీప్ సింగ్ పూరి ఏమన్నారు?
ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నామని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు, గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 500 నుంచి రూ. 550 కి పెరుగుతుంది. ఇతర వినియోగదారులు ఇప్పుడు రూ. 803 నుంచి రూ. 853 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం శాశ్వతం కాదని ప్రతి 2 నుంచి 3 వారాలకు ఒకసారి దీనిని సమీక్షిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. దీనితో పాటు, పెట్రోల్, డీజిల్‌పై పెరిగిన ఎక్సైజ్ సుంకం భారాన్ని సామాన్య ప్రజలపై వేయబోమని ఆయన స్పష్టం చేశారు. చమురు కంపెనీలకు గ్యాస్ అమ్మకంలో జరిగిన రూ. 43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ పెరుగుదల జరిగింది.





















