Kerala High Court On Nudity: అర్థనగ్నంగా ఉన్న మగాడిని వదిలేసి మహిళనే ఎందుకు ప్రశ్నిస్తారు- ఫాతిమా కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు
Kerala High Court On Nudity: రెహానా ఫాతిమా అర్ధనగ్న స్థితిలో ఉన్న వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది, ఇందులో ఆమె శరీరంపై పిల్లలు పెయింటింగ్ వేయడం సంచలనంగా మారింది.
Kerala High Court On Nudity: లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అరెస్టయిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను విడుదల చేయాలని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశించింది.
కొన్ని నెలల క్రితం ఫాతిమా పెట్టిన వీడియో పెను సంచలనంగా మారింది. ఆమె అర్థనగ్నంగా పడుకొని ఉంటే ఆమె శరీరంపై తన పిల్లలు పెయింటింగ్ వేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. దీనిపై సంప్రదాయ వాదుల తీవ్ర విమర్శలు చేశారు. ఆమెపై కేసులు కూడా పెట్టారు.
తన లైంగిక వాంఛ తీర్చుకోవడానికి పిల్లలను వాడుకుంటున్నారని కూడా ఆరోపణలు చేశారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఆమెపై వచ్చిన కేసులను పరిగణలోకి తీసుకున్నారు. ఆమెపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఫాతిమాను అరెస్టు కూడా చేశారు. దీనిపై కింది కోర్టుల్లో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎందుకు అలా చేశారో వివరంగా కోర్టుకు తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన రెహానా సమాజంలోని స్త్రీపురుష విభేదాలపై పోరాటానికి మద్దతుగా తాను ఈ వీడియో పెట్టినట్టు తెలిపారు. అశ్లీల అనే అంశంపై పురుషులకు ఒకలా స్త్రీల పట్ల ఇంకోలా ఈ సమాజం చూస్తోందని ఇది చాలా బాధాకరమని ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇద్దరూ సమానమే అనే కోణంలో దీన్ని చిత్రీకరించినట్టు కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న కేరళ హైకోర్టు తమ దృష్టిలో ఆ వీడియో అశ్లీలంగా కనిపించలేదని స్పష్టం చేసింది. అందువల్ల రెహానాను నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. ఆమెను విడుదల చేయాలని పోలీసులను ఆదేశిస్తున్నామని కోర్టు తెలిపింది.
పోలీసులు తమ చార్జిషీట్ లో ఏం చెప్పారు?
వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రెహానాపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోక్సో, ఐటీ చట్టంలోని సెక్షన్ 67బీ(డీ), జువెనైల్ జస్టిస్ (కేర్) చట్టంలోని సెక్షన్ 75లోని 13, 14, 15 సెక్షన్ల కింద రెహానాపై కేసులు నమోదు చేశారు. పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు.
ఉపశమనం కల్పిస్తూ ధర్మాసనం ఏం చెప్పింది?
రెహానా ఫాతిమాకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ కౌసర్ ఎడ్పగత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవ శరీర స్వేచ్ఛను ప్రస్తావిస్తూ, "మన సమాజంలో పురుషుడి అర్థనగ్న శరీరాన్ని , అతని స్వేచ్ఛను ఎవరూ పట్టించుకోరు. ప్రశ్నించరు. కానీ మహిళలను మాత్రం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ కేసులో మహిళలు వివక్షకు గురయ్యారు" అని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి చేస్తే ఆమెను బెదిరించడం, ఏకాకిని చేయడం, కేసులు పెట్టడం జరుగుతుంది అని అన్నారు.
తల్లి శరీరంపై బిడ్డ పెయింటింగ్ వేయించడాన్ని లైంగిక నేరంగా పరిగణించలేమని, లైంగిక సంతృప్తి కోసం ఆమె ఇదంతా చేసిందని చెప్పలేమని అన్నారు. ఈ వీడియోలో అశ్లీలంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని, ఇది కేవలం కళాత్మక వ్యక్తీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు. నగ్నంగా ఉండటం అనేది అన్ని వేళల్లో అశ్లీలత కాదని అభిప్రాయపడింది కోర్టు.