Viral Video: కర్ణాటకలో అర్ధరాత్రి హైవేపై రెచ్చిపోయిన యువకులు- కార్లతో ఢీకొట్టి, కర్రలతో బాదుతూ గ్రూప్ ఫైట్
Karnataka Viral Video: కర్ణాటక హైవేపై యువకులు రెచ్చిపోయారు. యువకులు రెండు వర్గాలుగా విడిపోయి కార్లతో ఒకరినొకరు గుద్దుకున్నారు. కర్రలతో దాడులకు తెగబడ్డారు.
Karnataka street fight in Udupi: బెంగళూరు: అర్ధరాత్రి వేళ యువత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి అనేక ప్రాంతాల్లో నెలకొంటుంది. తాజాగా కర్ణాటకలో కొందరు యువకులు అర్ధరాత్రి తర్వాత రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అర్ధరాత్రి రోడ్లపై యువత హల్ చల్
కర్ణాటకలో కొందరు యువకులు అర్ధరాత్రి తరువాత రోడ్డుపై హల్చల్ చేశారు. కార్లతో పరస్పరం ఢీ కొట్టుకున్న రెండు వర్గాలకు చెందిన యువకులు.. అనంతరం కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈనెల 18న ఉడిపి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉడిపి - మణిపాల్ హైవేపై ఈ ఘటన జరిగింది. రెండు కార్ల లో వచ్చిన ఆరుగురు యువకులు కొన్ని నిమిషాల పాటు వీరంగం సృష్టించారు. మొదట వచ్చిన ఓ కారు.. వేగంగా వెనక్కి వచ్చి మరో వాహనాన్ని ఢీకొట్టింది. అందులో నుంచి యువకులు దిగి కర్రలతో బాదుకున్నారు. ఈ క్రమంలోనే కర్ర పట్టుకున్న ఓ యువకుడిని మరో గ్రూప్ కు చెందిన కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా సుమారు అర్థగంటపాటు యువకులు మధ్య గొడవ సాగింది.
వీడియో తీసిన అపార్ట్మెంట్ వాసులు
ఈ గొడవకు సంబంధించిన వ్యవహారాన్ని సమీపంలో అపార్ట్మెంట్ నుంచి ఒకరు వీడియోలో రికార్డు చేశారు. ఈ వీడియోను కర్ణాటకకు చెందిన ఓ డాక్టర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాలే ఈ గొడవకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
Very bad state of affairs
— Dr Durgaprasad Hegde (@DpHegde) May 25, 2024
Gang War at Udupi
Incident happened recently late night, 2 groups fought on Udupi Manipal Highway near Kunjibettu
Where is the younger generation heading ???
Stringent action should be taken against all these culprits pic.twitter.com/EVAstmKumR
పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటున్న నెటిజన్స్
ఇదిలా ఉంటే ఈ తరహా గొడవలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయని, వీటిని నియంత్రించాల్సిన పోలీసులు పట్టనట్టు వివరించడమే ఇబ్బందులకు కారణం అవుతుందని భావనను పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తే మరోసారి ఈ తరహా ఘటనలు చోటు చేసుకునేందుకు అవకాశం ఉండదని పలువురు పేర్కొంటున్నారు. వీరిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని, అప్పుడే ఇలాంటివి తగ్గుతాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.