Karnataka: బీజేపీ- జేడీఎస్ పొత్తు ఖరారు, 2024 లోక్‌సభ ఎన్నికలకు కలిసే పోటీ- స్పష్టం చేసిన యడియూరప్ప
Karnataka: బీజేపీ, జేడీఎస్ పొత్తు ఖరారు అయింది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఊహించిందే జరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఘోరంగా దెబ్బతినడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు నిజమయ్యాయి. బీజేపీ, జేడీఎస్ కలిసే పోటీ చేస్తాయని కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజం అయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసే పోటీ చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి కాషాయ పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాను.. జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ కలిసిన విషయం తెలిసిందే. రెండు పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. 2023 లోక్‌సభ ఎన్నికల్లో 5 స్థానాలు కేటాయించాలని జేడీఎస్ ప్రతిపాదించగా.. చర్చల అనంతరం 4 స్థానాలకు పరిమితం అయ్యారు. ప్రధాని మోదీ, దేవెగౌడ ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు సీట్లను ఖరారు చేశారని కర్ణాటక యడియూరప్ప అన్నారు.
'దేవెగౌడ మన ప్రధానిని కలిసినందుకు సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ, దేవెగౌడ ఇప్పటికే 4 సీట్లను ఖరారు చేశారు. నేను వారిని స్వాగతిస్తున్నాను..' అని అన్నారు.
#WATCH | Bengaluru | On alliance with JDS in the upcoming Lok Sabha polls, Former Karnataka CM and BJP leader BS Yediyurappa says "I am happy that Deve Gowda ji met our Prime Minister and they have already finalised about 4 seats. I welcome them..." pic.twitter.com/phJGCCvtLj
— ANI (@ANI) September 8, 2023
బీజేపీ, జేడీఎస్ లు గతంలో పలుసార్లు పొత్తు పెట్టుకున్నప్పటికీ విభేదాల కారణంగా విడిపోయారు. అయితే యడియూరప్ప ప్రకటనతో మళ్లీ ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపిస్తోంది. జేడీఎస్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ 7 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క సీటు మాత్రమే గెలిచింది. మొత్తం ఓట్లలో 9.74 శాతం దక్కించుకుంది.
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను...కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు దక్కించుకున్నాయి. హసన్ స్థానం నుంచి దేవగౌడ మనవడు, మాజీ మంత్రి రేవణ్ణ తనయుడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్ ఎన్నిక ప్రక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఆయన ఎన్నికను రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు.
దేశ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలుపుతున్నామని జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి ఇటీవలే ప్రకటించారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైతో కలిసి బీజేపీతో జట్టుకట్టడంపై ప్రకటన చేశారు. కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాయని.. అందుకే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ ఘోర పరాభవం పొందాయ్. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది బీజేపీ.