Joshimath Sinking: మరో గ్రామంలోనూ జోషిమఠ్ సీన్? ఇళ్లకు పగుళ్లు, కుంగుతున్న భూమి - స్థానికుల్లో టెన్షన్ టెన్షన్
జోషిమఠ్ నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలాంగ్ గ్రామం పరిస్థితి కూడా దాదాపు జోషి మఠ్ లాగానే ఉంది.
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని హిమాయాల ఏటవాలు ప్రాంతంలో కట్టిన గ్రామం జోషి మఠ్ తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం కలవరపాటుకు గురి చేస్తోంది. జోషిమఠ్ నుండి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలాంగ్ గ్రామం పరిస్థితి కూడా దాదాపు జోషి మఠ్ లాగానే ఉంది. సెలాంగ్ గ్రామంలోనూ పలు ఇళ్లు, భూమిలో పగుళ్లు రావడం మొదలైంది. జోషిమఠ్ లోని పరిస్థితులను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో పగుళ్లు రావడం, కుంగిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి.
ఈ దుస్థితికి ఎన్‌టీపీసీయే కారణం: గ్రామస్తులు ఆరోపణలు
బద్రీనాథ్ జాతీయ రహదారి (NH-58)పై ఉన్న సెలాంగ్ గ్రామస్తులు జోషి మఠ్ తరువాత తమ ప్రాంతం అలాగే అవుతుందని తాము భయపడ్డామని చెప్పారు. జోషిమఠ్ సంక్షోభం వారి భయాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తోంది. తమ దుస్థితికి ఎన్‌టీపీసీ తపోవన్- విష్ణుగర్ జలవిద్యుత్ ప్రాజెక్టులే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సెలాంగ్ గ్రామానికి చెందిన విజేందర్ లాల్ పీటీఐతో మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కు సంబంధించిన సొరంగాలు గ్రామం కింద నుంచి నిర్మించారని.. ఈ సొరంగాలలో ఒకదాని ముఖద్వారం సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఒక హోటల్ జూలై 2021లో కూలిపోయిందని ఆయన తెలిపారు. దాని సమీపంలోని పెట్రోల్ పంపు కూడా పాక్షికంగా దెబ్బతింది. పగుళ్లు రావడంతో ఇప్పుడు దీని ప్రభావం ఇళ్లపై కనిపిస్తోంది.
గ్రామం కింద తొమ్మిది సొరంగాల నిర్మాణం
సెలాంగ్ గ్రామం కింద ఎన్‌టీపీసీకి చెందిన తొమ్మిది సొరంగాలు నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. ఈ సొరంగాల నిర్మాణంలో చాలా పేలుడు పదార్థాలను సైతం ఉపయోగించారు. వీటి కారణంగా గ్రామంలో పునాదులు అంత గట్టిగా లేవు. గ్రామంలో సుమారు 15 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని సమాచారం. గ్రామంలోని ప్రధాన నివాసానికి 100 మీటర్ల దిగువన డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తున్నట్లు గ్రామస్తుడు తెలిపారు. దీనికి కొన్ని మీటర్ల దూరంలో కూడా గ్రామం వైపు పగుళ్లు రావడం ప్రారంభించాయి.
ఎన్‌టీపీసీ వల్ల మా పరిస్థితి దయనీయంగా మారింది: సర్పంచ్
ఎన్టీపీసీ చేపట్టిన ప్రాజెక్టు వల్ల గ్రామస్తుల జీవనం దారుణంగా మారిందని సెలాంగ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శిశుపాల్ సింగ్ భండారీ అన్నారు. తమ గ్రామ సమస్యల పరిష్కారానికి అనేక దరఖాస్తులు పంపినా చర్యలు తీసుకోలేదన్నారు. దశాబ్దం కిందట ఎన్‌టిపిసి ఈ ప్రాంతంలో సొరంగాలు తవ్వడం ప్రారంభించినప్పటి నుండి తమకు నష్టం మొదలైందని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో ప్రజలు నిరసన తెలపడంతో ఎన్టీపీసీ ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఇళ్లకు బీమా చేయించుకుంది. కానీ, ఇప్పుడు ఇళ్లకు పగుళ్లు వస్తున్న తరుణంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం సైతం అందడం లేదు.
హిమాలయాల్లో అందంగా కనిపించే ఆ ఊరు ఇప్పుడు కళ్ల ముందే కుంగిపోతోంది. ఒకటి కాదు రెండు కాదు గడచిన పన్నెండుల్లో రోజుకు 5.4 సెంటీమీటర్ల మేర లోపలికి కుంగిపోయింది ఆ ఊరు మొత్తం. ఇళ్లన్నీ పగుళ్లు..గోడలన్నీ నెర్రెలిచ్చుకుపోయాయి...రోడ్ల మీద ఎక్కడ చూసినా భారీ గోతులు...ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇళ్లను వదల్లేక..మనసు రాక కొన్ని వందల మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషి మఠ్ దీన అవస్థ ఇది. ఏ క్షణమైనా ఊరు ఊరంతూ కుంగిపోతుంది. ఇదేమీ ఆషామాషీగా చెబుతోంది కాదు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ వాళ్లు విడుదల చేసిన శాటిలైట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గడచిన ఏడు నెలలుగా 8.9 సెంటీమీటర్లు కుంగిపోయిన జోషిమఠ్....లాస్ట్ పన్నెండు రోజుల్లోనే 5 సెంటీమీటర్లు లోనికి కుంగిపోయింది.