Jagdeep Dhankar Resignation Approved: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం- మాజీ ఉపరాష్ట్రపతి వేతనం ఎంత, ఆయన ఆస్తుల వివరాలివే
Vice President Jagdeep Dhankar | రాజ్యసభ సమావేశాలకు తొలిరోజు అధ్యక్షత వహించిన కొద్ది గంటల్లోనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి 2027లో ఆయన పదవీకాలం ముగియనుంది.

Jagdeep Dhankar Resignation: న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం పొందింది. సోమవారం నాడు ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం నాడు ఆమోదించారు. హోంమంత్రిత్వ శాఖకు ఆమోదం విషయాన్ని తెలిపారు. అనారోగ్య కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తెలిపారు. ఆయన సేవలను ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు కొనియాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఆకాంక్షించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. వైద్య సలహాలను పాటించడానికి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం రాజీనామా లేఖ సమర్పిస్తున్నాను అని ధన్‌ఖడ్ పేర్కొన్నారు.
వర్షాకాల సమావేశాలకు తొలిరోజు అధ్యక్షత
రాజ్యసభ వర్షాకాల సమావేశాల మొదటి రోజున అధ్యక్షత వహించారు. సభను సజావుగా నిర్వహిస్తారని అంతా భావించిన సమయంలో అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూలై 22న రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన కార్యనిర్వాహక కమిటీతో సహా అనేక ముఖ్యమైన సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించాల్సి ఉంది. జూలై 23, 2025న ఆయన ఒక రోజు పర్యటనలో భాగంగా జైపూర్‌ను సందర్శించాల్సి ఉంది. జైపూర్‌లోని రామ్‌బాగ్ ప్యాలెస్‌లో కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో జగదీప్ ధన్‌ఖడ్ భేటీ కావాల్సి ఉంది.
జగదీప్ ధన్‌ఖడ్ ఆగస్టు 2022లో దేశ 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2027లో ఆయన పదవీకాలం ముగియాల్సి ఉంది, అయితే అనారోగ్య కారణాలతో ముందే ఆయన రాజీనామా సమర్పించారు.
జగదీప్ ధన్‌ఖడ్ ఆస్తులు
భారత ఉపరాష్ట్రపతికి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఉపరాష్ట్రపతికి నెలకు దాదాపు 4 లక్షల రూపాయల జీతం అందుతుంది. వీటితో పాటు ప్రభుత్వ నివాసం, వైద్య సదుపాయం, ప్రయాణ ఖర్చులు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, సిబ్బంది, సెక్రటేరియల్ సహాయం వంటి ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ విధంగా ఉపరాష్ట్రపతిగా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ వారానికి రూ. 92,307, రోజుకు 18,461 రూపాయలు ఆయనకు లభించేవి.
ఉపరాష్ట్రపతి వార్షిక జీతం దాదాపు 48 లక్షల రూపాయలు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం ధన్‌ఖడ్‌కు దాదాపు 4.5 కోట్ల రూపాయల చరాస్తులు, దాదాపు 3.3 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి.






















