ISRO PSLV-C56 Launch: 30న ఇస్రో పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం, భారత్ రోదసిలోకి ఏం పంపబోతుందో తెలుసా?
ISRO PSLV-C56 Launch: ఇస్రో ఆదివారం రోజు పీఎస్ఎల్పీ సీ56 ప్రయోగాన్ని చేపట్టనుంది. శ్రీహరి కోట నుంచి ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.
ISRO PSLV-C56 Launch: భారత అంతరిక్షణ పరిశోధ సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో అన్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది.
పీఎస్ఎల్వీ సీ56 ఏం తీసుకెళ్లనుంది?
పీఎస్ఎల్వీ- సీ56 మిషన్.. పీఎస్ఎల్వీ- సీ55 మాదిరిగానే కోర్-ఎలోన్ మోడ్ లో కాన్ఫిగర్ చేశారు. DS-SAR ఉపగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్ గా పీఎస్ఎల్వీ- సీ56 తీసుకెళ్లనుంది. సింగపూర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (DSTA), ST ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్ని 5 డిగ్రీల వంపులో... 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్(NEO) లోకి ప్రవేశపెట్టనుంది. DS-SAR ఉపగ్రహం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్(IAI) అభివృద్ధి చేసిన సింథటిక్ అపెర్చర్ రాడారా (SAR) పేలోడ్ తో అమర్చారు. ఈ అధునాతన సాంకేతికత ద్వారా DS-SAR అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పగలైనా, రాత్రయినా కవరేజీని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. పూర్తి స్థాయి పొలారిమెట్రీ వద్ద 1m-రిజల్యూషన్ తో ఇమేజింగ్ ఇవ్వగలగు.
ఈ ఉపగ్రహం తన కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు DS-SAR తన సపోర్ట్ ను అందిస్తుంది. అలాగే ST ఇంజినీరింగ్ వారి వాణిజ్య వినియోగదారుల కోసం మల్టీ-మోడల్, హైయ్యర్ రెస్పాన్సివ్‌నెస్ చిత్రాల కోసం జియోస్పేషియల్ సేవల కోసం ఈ ఉపగ్రహాన్ని వాడుకోనున్నారు.
DS-SARతో పాటు మరో 6 ఉపగ్రహాలు
DS-SAR శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో ప్రకటించింది. టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2, IoT కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనుంది ఇస్రో.
చంద్రయాన్-3 ప్రస్తుతం ఎక్కడ ఉంది?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతంగా ఐదు దశలను పూర్తి చేసుకుని చంద్రుడివైపు వేగంగా కదులుతోంది. భూగురుత్వాకర్షణ పరిధిని దాటి ప్రస్తుతం చంద్రుడి వైపు సాగుతోంది చంద్రయాన్-3. తదుపరి చేపట్టే దశలు అన్నీ చంద్రయాన్-3 ప్రయోగానికి కీలకమే అని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 1, 2023 నిర్దేశించిన ప్రకారం చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించనుంది. ఈ మిషన్ లో ఇది కీలకమైన దశగా ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ దశలో చంద్రయాన్-3 చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోని కక్ష్యలోకి చేరుతుంది. క్రమంగా ఈ కక్ష్య పరిధిని కుదించుకుంటూ చంద్రునికి దగ్గరగా వెళ్తుంది. 1,27,609 కి.మీ x 236 కి.మీ కక్ష్యను చేరుకుని క్రమంగా చంద్రునికి దగ్గరగా వెళ్తుంది. అలా ఆగస్టు చివరి నాటికి చంద్రునికి 30 కిలోమీటర్ల దగ్గరి వరకు వెళ్తుంది. ఆ సమయానికి చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అసలు సిసలు పరీక్ష ప్రారంభం అవుతుంది. చంద్రయాన్-3 రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళికబద్ధంగా జరిగితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గో దేశంగా భారత్ నిలవనుంది. రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ రికార్డులకెక్కనుంది.