Tatkal Ticket Booking: ఐఆర్‌సీటీసీ ఖాతా రద్దు కావచ్చు! తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం రైల్వే కొత్త రూల్, ఆధార్ వెరిఫికేషన్ అవసరం
Tatkal Ticket Booking: ఆటోమేటెడ్ సాధనాలు ఉపయోగించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వ్యక్తులపై ఉక్కుపాదం మోపేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. దీని కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారు.

Tatkal Ticket Booking: మీరు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి IRCTC వెబ్‌సైట్‌ను కూడా ఉపయోగిస్తే, మీరు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి, మీ IRCTC ఖాతా రద్దు కావచ్చు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో మోసాన్ని నివారించడానికి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ కింద IRCTC ఖాతాదారులు అందరూ కచ్చితంగా ధృవీకరణ చేసుకోవాలి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
AC టిక్కెట్ల బుకింగ్ సరళి ఇది
ప్రతిరోజూ, దాదాపు 2.25 లక్షల మంది ప్రయాణికులు రైల్వేలోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుంచి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. మే 24 నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ సరళిని పరిశీలించినప్పుడు, AC తరగతిలో మొత్తం 108000 టిక్కెట్లలో, మొదటి నిమిషంలో 5615 టిక్కెట్లు మాత్రమే బుక్ అయినట్లు తేలింది. విండో ఓపెన్ చేసిన తర్వాత రెండో నిమిషంలో 22827 టిక్కెట్లు బుక్ అయ్యాయి. AC తరగతి విండో ఓపెన్ చేసిన మొదటి 10 నిమిషాల్లోనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో సగటున 67159 టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో బుక్ చేసిన మొత్తం టిక్కెట్లలో 62.5%.
AC తరగతి బుకింగ్ విండో ఓపెన్ చేసిన మొదటి గంటలోనే 92861 టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇది AC తరగతిలో ఆన్‌లైన్‌లో బుక్ చేసిన మొత్తం టిక్కెట్లలో 86%. 4.7% టిక్కెట్లు విండో తెరిచిన గంట నుంచి నాలుగు గంటల మధ్య బుక్ చేసుకున్నారు. అయితే 6.2% టిక్కెట్లు నాల్గో గంట నుంచి పదో గంట మధ్య అమ్ముడయ్యాయి. మిగిలిన 3.01% టిక్కెట్లు విండో ఓపెన్ చేసిన 10 గంటల తర్వాత బుక్ సేల్ అయ్యాయి.
నాన్ AC టికెట్ బుక్ చేసుకోవడానికి ఎంత సమయం?
నాన్ AC కేటగిరీలో మే 24- జూన్ 2 మధ్య ప్రతిరోజూ సగటున 118567 టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అయ్యాయి. ఇందులో 4724 టిక్కెట్లు అంటే మొత్తం టిక్కెట్లలో 4%, మొదటి నిమిషంలోనే సేల్ అయ్యాయి. రెండో నిమిషంలో, 20786 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది మొత్తం టిక్కెట్లలో 17.5%. విండో ఓపెన్ చేసిన మొదటి 10 నిమిషాల్లోనే 66.4% టిక్కెట్లు అమ్ముడయ్యాయి. విండో ఓపెన్ చేసిన మొదటి గంటలో 84.02% టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మిగిలిన టిక్కెట్లు తదుపరి 10 గంటల్లో బుక్ అయ్యాయి. దీని అర్థం ప్రజలు ఆన్‌లైన్ వ్యవస్థలో తత్కాల్ టిక్కెట్లు పొందుతున్నారని, టికెట్ల విండో ఓపెన్ అయిన 8 నుంచి 10 గంటల తర్వాత కూడా మొత్తం టిక్కెట్లలో దాదాపు 12% బుక్ చేసుకున్నారని స్పష్టమవుతోంది.
రైల్వే ఏ చర్యలు తీసుకుంటోంది?
ఆటోమేటెడ్ సాధనాలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వ్యక్తులపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. కృత్రిమ మేధస్సును ఉపయోగించే చర్యలకు సిద్ధమైంది. రైల్వేలు అభివృద్ధి చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా గత 6 నెలల్లో 2.4 కోట్లకుపైగా వినియోగదారులను డీయాక్టివ్ చేసి చేసి బ్లాక్ చేశారు. దాదాపు 20 లక్షల ఇతర ఖాతాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలింది. వీరి ఆధార్, ఇతర పత్రాలు పరిశీలిస్తున్నారు.
అకౌంట్ వెరిఫికేషన్ ఎందుకు అవసరం?
IRCTC వెబ్‌సైట్‌లో 13 కోట్లకుపైగా యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు, వీరిలో 1.2 కోట్ల మంది ఆధార్ వెరిఫికేషన్ చేసిన ఖాతాలు. ఆధార్‌తో వెరిఫై చేయని ఖాతాలపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని IRCTC నిర్ణయించింది. అనుమానాస్పదంగా అనిపిస్తే, వెరిఫై కాని ఖాతాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ సేవల కింద నిజమైన ప్రయాణీకులకు మాత్రమే టిక్కెట్లు లభించేలా రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ఆధార్‌తో తమ ఖాతాలను లింక్ చేసిన ఖాతాదారులకు తత్కాల్ బుకింగ్ మొదటి 10 నిమిషాల్లో ప్రాధాన్యత లభిస్తుంది. తత్కాల్ విండో ఓపెన్ అయిన మొదటి 10 నిమిషాల్లో సిస్టమ్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక ఏజెంట్లకు కూడా అనుమతి లేదు. అటువంటి పరిస్థితిలో, ఆధార్‌తో IRCTC ఖాతా వెరిఫికేషన్ అవసరమైంది.





















