భారతీయ రైల్వే సరికొత్త చరిత్ర- హైడ్రోజన్ రైలుతో సరికొత్త శకం.. టికెట్ ధరలు ఎలా ఉంటాయంటే?
హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరనుంది. మన దేశంలో మొదటి హైడ్రోజన్ రైలును హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 89 కిలోమీటర్ల వరకు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Indian Railways Record | ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన దేశంగా భారతీయ రైల్వే వ్యవస్థకు రికార్డు ఉంది. ప్రపంచంలో అత్యధిక రైల్వే నిర్వహణ సామర్థ్యం మన దేశానికే ఉంది. రోజుకు అత్యధిక ప్రయాణికులను (సుమారు 23 మిలియన్ల మంది) చేరవేసే రవాణా వ్యవస్థ కూడా భారతీయ రైల్వేనే. అంతేకాకుండా, ప్రపంచంలో 8వ అతిపెద్ద ఉద్యోగ కల్పనా సంస్థగా (1.4 మిలియన్ల మంది ఉద్యోగులు) కూడా ఇది గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ సంస్థ మరో రికార్డుకు చేరువలో ఉంది. హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరనుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు, ఎక్కడ ప్రారంభిస్తున్నారు, టికెట్ల ధరలు ఎలా ఉంటాయి వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి?
రైలు నడవాలంటే శక్తి అవసరం. దానికోసం బొగ్గు, డీజిల్, విద్యుత్ వంటివి ఉపయోగిస్తారు. హైడ్రోజన్ రైలులో మాత్రం శక్తి కోసం హైడ్రోజన్‌ను వినియోగిస్తారు. రైలును నడపడానికి హైడ్రోజన్ కణాలు (fuel cells) ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ విద్యుత్ శక్తితో రైలు నడుస్తుంది.
హైడ్రోజన్ రైళ్ల ప్రత్యేకతలు ఏంటి?
హైడ్రోజన్ రైళ్ల ప్రత్యేకతలు ఏమిటంటే, డీజిల్ రైళ్లలా ఇవి కాలుష్యాన్ని విడుదల చేయవు. ఈ రైళ్ల నుండి నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయి. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి పర్యావరణానికి హాని కలిగించే కాలుష్య కారకాలు విడుదల కాకపోవడం వీటిలో ముఖ్యమైన విషయం. ఈ రైళ్లు చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి కాబట్టి, రైలులో ప్రయాణికులకు, పట్టాల సమీపంలో నివసించే వారికి ధ్వని కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డీజిల్ ఇంజిన్‌లలో జరిగే దహన ప్రక్రియ ఈ రైళ్లలో లేకపోవడమే దీనికి కారణం.
హైడ్రోజన్ రైళ్లు తమకు అవసరమైన విద్యుత్‌ను స్వయంగా తయారు చేసుకుంటాయి కాబట్టి, ఎలక్ట్రిఫైడ్ కాని రైల్వే ట్రాక్‌ల మీద కూడా ప్రయాణించగలవు. వీటికి బయటి నుండి విద్యుత్ అందించాల్సిన అవసరం ఉండదు. ఇది రైల్వే శాఖకు విద్యుత్ లైన్లు వేసే ఖర్చును భారీగా తగ్గిస్తుంది. అంతేకాకుండా, హైడ్రోజన్ ట్యాంకులను నింపడానికి లేదా మార్చడానికి తక్కువ సమయం పడుతుంది. దీనివల్ల అతి తక్కువ సమయంలో రైలు తిరిగి సేవలు అందించడానికి సిద్ధమవుతుంది. మన దేశంలో తయారైన హైడ్రోజన్ రైలు 1200 హెచ్‌పీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ప్రపంచంలో ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లను వాడుతున్న దేశాలు కేవలం 500 నుండి 600 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న రైళ్లను మాత్రమే నడుపుతున్నాయి. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలుగా చెప్పవచ్చు.
ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి?
మనకంటే ముందు కొన్ని దేశాలు హైడ్రోజన్ రైళ్లను ఉపయోగిస్తున్నాయి. ఈ రైళ్లను ప్రవేశపెట్టిన మొదటి దేశం జర్మనీ. 2018లో డీజిల్ లోకోమోటివ్‌లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రైళ్లను జర్మనీ ప్రారంభించింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా ఈ ఏడాది ప్రాంతీయ మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. ఇక చైనా హైడ్రోజన్ రైల్వే వ్యవస్థలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. చైనా తన మొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు INOVA H2ను ఇప్పటికే ప్రవేశపెట్టింది. స్వీడన్, యూకే, అమెరికా, జపాన్ దేశాలు కూడా ఈ సాంకేతికతతో రైళ్లను నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశం ఆగస్టు 31 నాటికి ఈ వ్యవస్థను ప్రజలకు పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మన హైడ్రోజన్ రైలు తయారీ ఖర్చు ఎంత?
మన దేశంలో హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో విజయవంతంగా పరీక్షించారు. మన దేశంలో మొదటి హైడ్రోజన్ రైలును హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 89 కిలోమీటర్ల వరకు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పరీక్షల్లో పాసైన ఈ రైలు వచ్చే నెల 31వ తేదీ (ఆగస్టు 31, 2025) నాటికి అందుబాటులోకి వస్తుందని ICF చీఫ్ తెలిపారు.
"హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్" అనే కార్యక్రమం కింద 35 హైడ్రోజన్ రైళ్లను భారతీయ సాంస్కృతిక, పర్యాటక, చారిత్రక ప్రదేశాల్లో నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ రైలు సేవలు ప్రారంభమైన తర్వాత వాణిజ్యపరంగా కూడా వీటిని ఉపయోగించాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది. 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాలను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో హైడ్రోజన్ రైళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే, ఒక్క హైడ్రోజన్ రైలు తయారీకి 80 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు, ఈ రైళ్లు నడిచే మార్గాల్లో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి, నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 70 కోట్లు ఖర్చవుతుందని అంచనా. "హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్" కార్యక్రమం కింద 35 రైళ్లను ప్రవేశపెట్టడానికి దాదాపు 2,800 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. వీటికి అవసరమైన సదుపాయాల కోసం మరో 600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం, పైలట్ ప్రాజెక్టు కింద జింద్-సోనిపట్ రైలు మార్గంలో డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను హైడ్రోజన్ రైలుగా మార్చేందుకు 111.83 కోట్ల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి.
హెరిటేజ్ మార్గాల్లో తిప్పే ఈ రైళ్ల టికెట్ ధరపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఇవి పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక ప్రాంతాల్లో సేవలు అందిస్తాయి కాబట్టి, సాధారణ రైలు టికెట్ కన్నా ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.





















