India GDP News: ఊహించనంత ఎగబాకిన దేశ జీడీపీ, గతేడాది కంటే ఎంతో మెరుగు - తాజా రిపోర్టులో కీలక వివరాలు
Indias GDP: గడిచిన మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 7 శాతం కంటే తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, అందుకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయి.
Statistics and Programme Implementation: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఎగబాకిందని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ గురువారం (ఫిబ్రవరి 29) ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన 8.4 శాతానికి జీడీపీ చేరుకుందని వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో జీడీపీ వృద్ధి 4.3 శాతంగా ఉంది. 2023-24 మూడో త్రైమాసికంలో స్థిరమైన ధరల వద్ద జీడీపీ రూ.43.72 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 2022-23 మూడో త్రైమాసికంలో రూ.40.35 లక్షల కోట్లు, వృద్ధి రేటు 8.4 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గడిచిన మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 7 శాతం కంటే తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోందని అర్థం అవుతోంది. కానీ, మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.6 శాతం కంటే మెరుగ్గా ఉంది. నిర్మాణ రంగంలో 10.7 శాతంతో రెండంకెల వృద్ధి రేటు నమోదైంది. దాని తర్వాత తయారీ రంగం 8.5 శాతంతో మంచి వృద్ధి రేటు కనబర్చింది. ఇవే ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిని పెంచాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధి నమోదవడం వెనుక ఈ రంగాల వృద్ధి కీలక కారణాలని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది.