CAA: సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ - అమలుకు విరామం ఇవ్వాలని విజ్ఞప్తి
Petition Against CAA: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Iuml Petition Against CAA in Supreme Court: సార్వత్రిక ఎన్నికల ముందు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంను (CAA) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది. అయితే, దీనిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా, సీఏఏ (Citizenship Amendment Act) అమలుకు విరామం ఇవ్వాలంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షా పూరితమైందంటూ అభ్యంతరం తెలిపింది. కాగా, 2019లోనూ సీఏఏను సవాల్ చేస్తూ ఐయూఎంఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడంతో ఆ చట్టం అమల్లోకి రాదని అప్పట్లో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తాజాగా, నిబంధనలు అమల్లోకి రావడంతో ఈ అంశంపై మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చే వరకూ దీని అమలుపై స్టే ఇవ్వాలని తన పిటిషన్ లో పేర్కొంది.
కాగా, సీఏఏ చట్టం - 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొంది.. రాష్ట్రపతి సమ్మతి లభించినా.. విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్త నిరసనలతో దీని అమలులో జాప్యం జరిగింది. 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ సర్కార్ 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్‌ని ప్రవేశపెట్టింది. 2020లో అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా తాత్కాలికంగా ఆ చట్టాన్ని పక్కన పెట్టింది. దాదాపు ఐదేళ్ల తరవాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరిపై వివక్ష చూపేలా ఉంటే ఈ చట్టాన్ని అమలు చేయబోనని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. అటు, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదంటూ కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు. తాజాగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం సీఏఏ అమలును వ్యతిరేకించారు.
చట్టంలో ఏముంది..?
పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన లక్ష్యం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం. అయితే.. ఈ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు హింసకు గురై భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు. అర్హులెవరో కూడా ఈ గెజిట్‌లో స్పష్టంగా చెప్పింది కేంద్రం. భారత్‌లో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఓ నిబంధన ఉంది. దాన్ని పూర్తిగా సవరించింది మోదీ సర్కార్. గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్‌లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే..ఇందులో గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో ఉండడం వల్ల అసోంలోని కర్బీ అంగ్‌లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చమ్‌కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది.